అమిత్ షా జోక్యం.. మంత్రి బర్తరఫ్‌పై వెనక్కి తగ్గిన తమిళనాడు గవర్నర్
గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రస్థాయిలో స్పందించారు. గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేస్తూ తాను తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తగ్గారు. మంత్రి సెంథిల్ విషయంలో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో కేంద్రమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిచే ప్రయత్నం చేశారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సెంథిల్ బాలాజీని కొద్దిరోజుల కిందట ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి పదవికి అనర్హుడని క్యాబినెట్ నుంచి సెంథిల్ ను తొలగిస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం గవర్నర్ తన విచక్షణాధికారం ఉపయోగించినట్లు రాజ్ భవన్ అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది.
గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రస్థాయిలో స్పందించారు. గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. తన క్యాబినెట్లో మంత్రిని తొలగించే హక్కు గవర్నర్ కు ఉండదని మండిపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉండటంతో కేంద్ర మంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నారు. అటార్నీ జనరల్ సూచన తీసుకోవాలని తమిళనాడు గవర్నర్ కు సూచించారు.
ఈ అంశంపై తమిళనాడులో బుధవారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఆ సమయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి అటార్నీ జనరల్‌తో భేటీ అయ్యారు. అనంతరం మంత్రి సెంథిల్ బాలాజీ విషయంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు గవర్నర్ ప్రకటించారు.
గవర్నర్ నిర్ణయంతో సెంథిల్ బాలాజీ మంత్రిగా కొనసాగనున్నారు. ప్రస్తుతం సెంథిల్ కోర్టు ఆదేశాల మేరకు ఈడీ జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. మంత్రి సెంథిల్ బాలాజీ విషయంలో గవర్నర్ వెనక్కి తగ్గినప్పటికీ ఆయనపై న్యాయపరంగా పోరాటం చేయాలని డీఎంకే ప్రభుత్వం పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.