కేబినెట్ నుంచి అమిత్ షాను తొలిగించాలి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ఉద్దేశించి ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే ఫైర్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ఉద్దేశించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆయనను అవమానించడమేనంటూ విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీపై విరుచుకుపడ్డారు. అమిత్ షాను కేబినెట్ నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు.
వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదు. వారు మనుస్మృతి గురించి మాట్లాడుతుంటారు. అమిత్ షాకు మద్దతుగా పీఎం మోదీ ఆరు పోస్టులు పెట్టారు. అందులో అంత అవసరం ఏమున్నది? ఎవరైనా అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడితే.. అలాంటి వ్యక్తినికేబినెట్ నుంచి తొలిగించాలి. కానీ వారిద్దరు స్నేహితులు. ఒకరి పాపాలకు మరొకరు మద్దతు ఇస్తున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా దేశానికి క్షమాపణలు చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు.
షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే కూడా స్పందించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఎక్కువ పాపాలు చేసిన వారు మాత్రమే పుణ్యం గురించి ఆలోచించాలి. దేశం, ప్రజలు, రాజ్యాంగ పరిరక్షణ గురించి ఆలోచించేవారు అంబేద్కర్ పేరు మాత్రమే ఉచ్చరిస్తారు అని అన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత, దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని రాహుల్ గాంధీ అన్నారు. ఆయనను, ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని అవమానించడాన్ని దేశం సహించదన్నారు. ప్రియాంక గాంధీ స్పందిస్తూ... అంబేద్కర్ పేరు ప్రస్తావించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తారు. కోట్లాది మంది దళితులు, అణగారిన వర్గాల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. అంబేద్కర్ మార్గదర్శకం, స్ఫూర్తిబాటలో నడిచే లక్షలాదిమందికి అమిత్ షా వ్యాఖ్యలు అవమానకరమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ ముసుగు వీగిపోయిందన్నారు. ద్వేషంతో నిండిపోయిన పార్టీ నుంచి ఇంకేమీ ఆశించగలమంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ.. బీజేపీ మిత్రపక్షాలు అమిత్ షా వ్యాఖ్యలతో ఏకీభవిస్తాయా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ పేరును, బీజేపీ, కాంగ్రెస్ లు రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాయని, ఆయన సేవలను గౌరవించడంలో విఫలమవుతూనే ఉన్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు గుప్పించారు.
అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్షాల నిరసనలతో రాజ్యసభ అట్టుడికింది. ఈ క్రమంలో సభ గురువారానికి వాయిదా పడింది. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షాపై టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.
కాగా.. అమిత్ షాకు వ్యతిరేకంగా విమర్శలు వస్తున్న వేళ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వరుస పోస్టులు పెట్టారు. అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి షెడ్యూల్ కులాలు, తెగలను కించపరచడానికి కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసిందో ప్రజలంతా చూశారని పేర్కొన్నారు. మనం ఇలా ఉండటానికి అంబేద్కరే కారణం. గత దశాబ్దకాలంగా ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి మా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసింది. ఆయనను సంపూర్ణంగా గౌరవిస్తుంది మేమే అంటూ కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు.