Telugu Global
National

మహా సర్కార్‌ కూల్చివేతను బహిరంగంగా సమర్ధించుకున్న అమిత్ షా

ఉద్దవ్ థాక్రే బీజేపీకే వెన్నుపోటు పొడిచారని అందుకే ఆయన ప్రభుత్వాన్ని కూల్చి గుణపాఠం చెప్పాల్సి వచ్చిందన్నారు. రాజకీయాల్లో మోసం చేసినవారికి శిక్ష పడాల్సిందేనన్నారు. తాము రాజకీయాల్లో దేనినైనా సహిస్తాం గానీ వెన్నుపోటును సహించబోమని అమిత్ షా హెచ్చరించారు.

మహా సర్కార్‌ కూల్చివేతను బహిరంగంగా సమర్ధించుకున్న అమిత్ షా
X


బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చేందుకు ఇటీవల బీజేపీ బహిరంగంగానే పావులు కదుపుతోంది. మహారాష్ట్రలో విజయవంతమైనా ఢిల్లీ, బీహర్‌, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ ఎత్తులు పారలేదు. ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా మరో అడుగు ముందుకేసి ప్రత్యర్థి ప్రభుత్వాలను కూల్చడాన్ని సమర్ధించుకున్నారు.

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చడాన్ని అమిత్ షా సరైన చర్యగానే కితాబిచ్చుకున్నారు. ఉద్దవ్ థాక్రే బీజేపీకే వెన్నుపోటు పొడిచారని అందుకే ఆయన ప్రభుత్వాన్ని కూల్చి గుణపాఠం చెప్పాల్సి వచ్చిందన్నారు. రాజకీయాల్లో మోసం చేసినవారికి శిక్ష పడాల్సిందేనన్నారు. తాము రాజకీయాల్లో దేనినైనా సహిస్తాం గానీ వెన్నుపోటును సహించబోమని అమిత్ షా హెచ్చరించారు.

శివసేన చీలిపోవడానికి కారణాన్ని ఉద్దవ్‌పైకే అమిత్ షా నెట్టారు. ఉద్దవ్ అధికార దాహమే సొంత మనుషులు ఎదురు తిరిగే పరిస్థితిని తెచ్చిందన్నారు. తమ పార్టీని మోసం చేయడమే కాకుండా.. శివసేన సిద్ధాంతాలకూ ఉద్ధవ్ వెన్నుపోటు పొడిచారని, ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేశారని అమిత్ షా ఆరోపించారు. తమకు తలుపులేసుకుని గదుల్లో రాజకీయాలు చేయడం తెలియదని.. బీజేపీ రాజకీయాలను బహిరంగంగానే చేస్తుందని కూడా అమిత్ షా చెప్పారు. ముంబైలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

First Published:  5 Sept 2022 1:30 PM GMT
Next Story