అమిత్ షా అబద్ధాలకోరు..ఆయనకు చరిత్ర తెలియదు : నితీష్ కౌంటర్
అమిత్ షా కు చరిత్ర తెలియదు. స్వాతంత్య్ర ఉద్యమం గురించి, మహాత్మా గాంధీ గురించి ఆయనకేం తెలుసు.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విరుచుకపడ్డారు. అధికారం కోసం సిద్ధాంతాలను వదిలేసిన వ్యక్తి నితీష్ అంటూ అమిత్ షా చేసిన విమర్శలపై నితీష్ మండిపడ్డారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ , కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారం కోసం సిద్ధాంతాలను వదిలేసిన వ్యక్తి నితీష్ అంటూ అమిత్ షా విమర్శించారు. దీనికి కౌంటర్ గా అమిత్ షా కు చరిత్ర తెలియదు. స్వాతంత్య్ర ఉద్యమం గురించి, మహాత్మా గాంధీ గురించి ఆయనకేం తెలుసు.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ దుమ్ము దులిపేశారు నితీష్.
ప్రముఖ సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ (జెపి) జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం సితాబ్ దియారా లో జరిగిన సభలో అమిత్ షా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 1970 దశకంలో జెపి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మహోద్యమాన్ని నడిపారని ఎంతోమంది నాయకులను ఆయన దేశానికి అందించిన వారిలో నితీష్ కుమర్ ఒకరు. కానీ ఆయన అధికారం కోసం జెపి సిద్ధాంతాలను ఆయన చూపిన బాటను వదిలేసి ఐదు సార్లు అందలం ఎక్కారని అమిత్ షా విమర్శించారు. ఇటువంటి వ్యక్తిని ఆమోదిస్తారా అని ప్రశ్నించాడు. జెపి తాను నమ్మిన సిద్ధాంతల కోసమే పాటుపడ్డారు తప్ప ఏనాడూ అధికారం కోసం అర్రులు చాచలేదన్నారు. జెపి చూపిన బాటలో నడుస్తున్న నరేంద్ర మోడి నేతృత్వంలోని బిజెపి కావాలో అధికారం కోసం కాంగ్రెస్ సరసన చేరినటువంటి వ్యక్తులు కావాలో బిహార్ ప్రజలు నిర్ణయించుకోవాలని అమిత్ షా అన్నారు.
షా వ్యాఖ్యలను నితీష్ తొలుత కొట్టిపారేశారు. ఆ తర్వాత ఘాటుగా స్పందిస్తూ..జెపి ఉద్యమం గురించే కాదు, తన సొంత రాష్ట్రం గుజరాత్ గురించి కూడా అమిత్ షాకు ఏమీ తెలియదని ఆరోపించారు. ఈ సందర్భంలో మహాత్మా గాంధీ హత్య గురించి ప్రజలకు మరోసారి గుర్తు చేస్తూ షా పై ధ్వజమెత్తారు. "అయినా ఆయనకేం తెలుసు.. ఎంతకాలంగా రాజకీయాల్లో ఉన్నారు.. సొంత రాష్ట్రం గురించి ఎంత తెలుసు.. 2002 నుంచి మాత్రమే వారికి అవకాశం వచ్చింది... జేపీ ఉద్యమం ఎప్పుడు జరిగింది.. 1974లో.. చరిత్ర తెలియని వారు ఏదో అంటూనే ఉంటారు. " అని పాట్నాలో నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. "దేశ స్వాతంత్య్రం కోసం పోరాడింది ఎవరు.. మహాత్మాగాంధీ అందుకోసం మహోద్యమం నడిపారు. అటువంటి బాపూను హత్య చేసిందెవరు. అందుకే అటువంటి వ్యక్తులతో సంబంధాలు ఉండకూడదు "అని నితీష్ అన్నారు.
అమిత్ షా బిహార్ లోనే కాదు దేశమంతా తిరుగుతూ సమాజంలో సామరస్య వాతావరణాన్ని, కులమత సమతుల్యతను దెబ్బతీస్తున్నాడని జనతాదళ్ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ విమర్శించారు. అమిత్ షా రాష్ట్ర పర్యటన ఉద్దేశం ఏమిటో అందరికీ తెలుసు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నితీష్ బిజెపితో తెగతెంపులు చేసుకున్నప్పట్నుంచి తిరిగి అధికారంలోకి రావాలని బిజెపి కొత్త గేమ్ ప్లాన్ చేస్తోందని ఆర్జెడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు.