Telugu Global
National

బీజేపీ ఆరోప‌ణలను ఖండించిన న్యూయార్క్ టైమ్స్‌

ఢిల్లీ పాఠశాలల పై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం పెయిడ్ ఆర్టికల్ అంటూ బీజేపీ నేతల ఆరోపణలను న్యూయార్క్ టైమ్స్ ఖండించింది. తాము ప్ర‌చురించిన ఆర్టిక‌ల్ క్షేత్ర స్థాయిలో వాస్త‌వాల ఆధారంగా రాసింద‌ని, అది ప్ర‌క‌ట‌న కాద‌ని దానికి ఎటువంటి చెల్లింపులు జరగలేదని స్ప‌ష్టం చేసింది.

బీజేపీ ఆరోప‌ణలను ఖండించిన న్యూయార్క్ టైమ్స్‌
X

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత‌, ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ శిసోడియా ఇంటిపై సిబిఐ దాడికి కార‌ణ‌మ‌ని చెబుతున్న న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక క‌థ‌నం బిజెపి, ఆప్ మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారితీసింది. న్యూయార్క్ టైమ్స్ లో ప్ర‌చురించిన క‌థ‌నం 'పెయిడ్ ఆర్టిక‌ల్' అంటూ బిజెపి నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మొత్తం మీద ఈ రెండు పార్టీల వివాదంలోకి అమెరిక‌న్ ప‌త్రికను లాగారు బిజెపి నేత‌లు. ఆ ప‌త్రిక పెయిడ్ ఆర్టిక‌ల్స్‌ను ప్ర‌చురించింద‌న్న అభిప్రాయాన్ని క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అయితే బిజెపి నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఆప్ తో పాటు 'ది న్యూయార్క్ టైమ్స్' ప‌త్రిక కూడా తీవ్రంగా ఖండించింది.

"నేను వారికి సవాలు చేస్తున్నాను, మీ వద్ద ఉన్న డబ్బును, మీ వద్ద ఉన్న అధికారాన్ని ఉపయోగించి మీరు న్యూయార్క్ టైమ్స్‌లో ఒక కథనాన్ని ప్రచురించడానికి ప్రయత్నించండి, "అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు..

శిసోడియా పై క‌థ‌నం ప్ర‌చురించడానికి ఆప్ ఆ ప‌త్రిక‌కు డ‌బ్బులు చెల్లించిందని బిజెపి నేత‌లు ప‌లువురు ట్విట్ట‌ర్ ద్వారా విమ‌ర్శిస్తున్నారు. ఖలీజ్ టైమ్స్ ప‌త్రిక‌లో కూడా "అదే" కథనం ముద్రించార‌ని బిజెపి నేత‌లు ఆరోపిస్తున్నారు. బిజెపి నేత‌ పర్వేష్ వర్మ మీడియాతో మాట్లాడుతూ న్యూయార్క్ టైమ్స్, ఖలీజ్ టైమ్స్‌లను చూపుతూ.. "ఇది రెండు వార్తా పత్రికల ఫోటో. రెండు వార్తాపత్రికలకు ఒకే రిపోర్టర్ ఉన్నారు, కథనం ఒకటే, ప్ర‌తీ పదం ఒకే విధంగా ఉన్నాయి ఏ మార్పూలేదు. ప్ర‌చురించిన ఆరు ఫొటోలు కూడా ఒకే విధంగా రెండింటిలోనూ ఉన్నాయి. అది ఎప్పుడైనా జరుగుతుందా?" అని ప్ర‌శ్నించారు. పలువురు బీజేపీ నేతల‌తో పాటు బిజెపి ఐటి విభాగం ఛీఫ్ అమిత్ మాల‌వీయా కూడా తమ ట్వీట్ల ద్వారా ఇవే ఆరోపణలను చేశారు.

కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్లిప్‌ను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు: "(కేజ్రీవాల్) స్వయంగా న్యూయార్క్ టైమ్స్‌లో "వార్తలు ప్రచురించడం" అంత సులభం కాదని అంగీకరించారు. ఎంతకాలం ప్రజాధనాన్ని ప్రకటనల కోసం వెచ్చిస్తారు? మీరు ముఖ్యమంత్రా లేక‌ చీఫ్ మార్కెటీరా?"అని ప్ర‌శ్నించారు.

బిజెపి నేత‌ల విమ‌ర్శ‌లను ఆప్ తిప్పి కొట్టింది. "జాతీయ టీవీలో వారు అబద్ధాలు చెబుతున్నారు! న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నం వారి సిబ్బందికి (కరణదీప్ సింగ్) క్రెడిట్ ఇచ్చింది. ఖలీజ్ టైమ్స్‌లో, "న్యూయార్క్ టైమ్స్ సౌజన్యంతో," అని రాశారు అని ఆప్ నేత భరద్వాజ్ అన్నారు. బిజెపి నేత‌లు దానిని ప‌ట్టించుకోవ‌డంలేద‌ని అన్నారు. ఆప్ మ‌రో నేత రాఘవ్‌ చద్దా స్పందిస్తూ..బిజెపి వాదన నవ్వు తెప్పించేదిగా ఉంద‌న్నారు. "బిజెపి నాయకుడి గురించి ఏ వార్త కూడా ఆ వార్తా ప‌త్రిక‌లో ఎప్పుడూ ప్ర‌చుర‌ణ కాలేదు. బిజెపి తనను తాను ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భావిస్తుంది. ఇది అత్యంత ధనిక రాజకీయ పార్టీ. ఎవరైనా వాటిని కొనుగోలు చేయగలిగితే ప్రతిరోజూ న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో కనిపించాలి" అని చద్దా ట్వీట్ చేశారు.

న్యూయార్క్ టైమ్స్ ఖండ‌న‌..

కాగా, బిజెపి నేత‌ల ఆరోప‌ణ‌ల‌పై న్యూయార్క్ టైమ్స్ తీవ్రంగా స్పందించింది. తాము ప్ర‌చురించిన ఆర్టిక‌ల్ క్షేత్ర స్థాయిలో వాస్త‌వాల ఆధారంగా రాసింద‌ని, అది ప్ర‌క‌ట‌న కాద‌ని దానికి ఎటువంటి చెల్లింపులు జరగలేదని స్ప‌ష్టం చేసింది.

"ఢిల్లీ విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి మా రిపోర్టు నిష్పాక్షిక, క్షేత్ర స్థాయి వాస్త‌వాల రిపోర్టింగ్‌పై ఆధారపడింది. విద్యకు సంబంధించిన అనేక విష‌యాల‌పై 'ది న్యూయార్క్ టైమ్స్' చాలా సంవత్సరాలుగా కవర్ చేస్తున్నది. న్యూయార్క్ టైమ్స్ జర్నలిజం ఎప్పుడూ స్వతంత్రంగా ఉంటుంది. ఇతర వార్తా సంస్థ‌లు మా కవరేజీని పున‌ర్ముద్రించుకునేందుకు లైసెన్స్ ఉంది. అందువ‌ల్ల వాటిని అవి ప్ర‌చురిస్తాయి." అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక ప్రకటనలో తెలిపింది.

First Published:  19 Aug 2022 10:38 PM IST
Next Story