Telugu Global
National

అడవిలో గొలుసులతో బందీగా మహిళ.. గొర్రెల కాపరి చొరవతో వెలుగులోకి..

మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళను ఇనుప గొలుసులతో కట్టేసి, సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశంలో వదిలేశాడు ఒక వ్యక్తి.

అడవిలో గొలుసులతో బందీగా మహిళ.. గొర్రెల కాపరి చొరవతో వెలుగులోకి..
X

మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళను ఇనుప గొలుసులతో కట్టేసి, సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశంలో వదిలేశాడు ఒక వ్యక్తి. మహిళ ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం బయట పడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోనుర్లి గ్రామశివార్లలో ఓ గొర్రెల కాపరి అడవి సమీపంలో గొర్రెలను మేపుతుండగా మహిళ అరుపులు వినిపించాయి. చుట్టుపక్కల వెతకగా ఒక 50 ఏళ్ల మహిళ గొలుసులతో చెట్టుకు నిర్బంధించబడి ఉంది . దీంతో అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగం లోకి దిగిన పోలీసులు ప్రథమ చికిత్స కోసం ఆమెను సింధుదుర్గ్ లోని సావంత్‌వాడి తాలూకాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమె వద్ద పాస్‌పోర్ట్‌, ఆధార్‌ కార్డ్‌, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓరోస్‌లోని ఆస్పత్రికి తరలించారు.

ఆమె సుమారు 40 రోజులుగా ఆహారం తినకుండా అక్కడే ఉందని, మాట్లాడే స్థితిలో లేకపోవడంతో తనకు సంబంధించిన కొన్ని వివరాలు ఆమె కాగితం పై రాసి ఇచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. గొడవ కారణంగా తన భర్తే తనను ఇలా అడవీలో బంధించినట్లు ఆమె రాసి చూపించిందని వెల్లడించారు. మహిళను లలితా కయీగా గుర్తించిన పోలీసులు ఆమె పదేళ్లుగా భారత్‌లో ఉంటున్నదని, వీసా గడువు కూడా ముగిసిందని చెబుతున్నారు. బాధితురాలికి ప్రాణాపాయం ఏమి లేకపోయినప్పటికీ , మానసిక, ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు.

తమిళనాడుకు చెందిన భర్త ఆమెను అడవిలోని చెట్టుకు గొలుసులతో కట్టేసి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో ఆమె ఎన్ని రోజులు ఆ అడవిలో అలాంటి దీనస్థితిలో ఉన్నదో తెలియదన్నారు. తమిళనాడు, గోవాలోని ఆ మహిళ బంధువులను గుర్తించి ఆమె సమాచారం సేకరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

First Published:  29 July 2024 11:29 AM
Next Story