Telugu Global
National

అంబానీ సేతు.. ప్రభుత్వాలకు సిగ్గొస్తుందా..?

ఈ వంతెన నిర్మాణానికి అంబానీ ఏమైనా ధన సహాయం చేశారేమో, అందుకే దీనికి ఆ పేరు పెట్టారేమో అనుకుంటే పొరపాటే. ఆ పేరు వెనక అసలు కారణం వేరే ఉంది.

అంబానీ సేతు.. ప్రభుత్వాలకు సిగ్గొస్తుందా..?
X

రామసేతు గురించి విన్నాం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దీన్ని బీజేపీ ఎలా వాడుకుందో కూడా అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అంబానీ సేతు అనే మరో పేరు తెరపైకి వచ్చింది. బీహార్ లోని కిరాత్ పూర్ గ్రామ సమీపంలో కోసీ నదిపై వెదురు కర్రలతో నిర్మించిన వంతెన ఇది. దీనిపేరే అంబానీ సేతు. ఈ వంతెన నిర్మాణానికి అంబానీ ఏమైనా ధన సహాయం చేశారేమో, అందుకే దీనికి ఆ పేరు పెట్టారేమో అనుకుంటే పొరపాటే. ఆ పేరు వెనక అసలు కారణం వేరే ఉంది.

ప్రభుత్వానికి సిగ్గు రావాలని..

బీహార్ లోని కిరాత్ పూర్ గ్రామం కోసీ నదికి అవతలి వైపు ఉంది. ఇవతలివైపుకి వస్తే నాలుగు జిల్లాలతో ఆ గ్రామస్తులు అనుసంధానం అవుతారు. కానీ చాన్నాళ్లుగా కోసీపై వంతెన లేదు. నది దాటాలంటే తెప్పలు, పడవలే ప్రత్యామ్నాయం. ప్రమాదాలు జరిగినా, ప్రాణాపాయం అని తెలిసి కూడా గ్రామస్తులు ప్రతి రోజూ సాహసం చేయాల్సిందే. ప్రభుత్వానికి ఎన్నోసార్లు అర్జీలిచ్చారు. కేంద్రానికి కూడా పలుమార్లు వినతులు పంపించారు. కానీ ఎవరికీ పట్టలేదు. అధికారులు మొద్దునిద్ర వీడలేదు, ప్రభుత్వం పట్టించులోదు. దీంత గ్రామస్తులు ఓ వినూత్న ఆలోచన చేశారు. తామే చందాలు వేసుకుని నదిపై వంతెన కట్టుకున్నారు. అక్కడితో ఆగితే దానికి శ్రమదానం అనే బిరుదు తప్ప ఇంకేమీ రాదు. అందుకే దానికి అంబానీ సేతు అనే పేరు పెట్టారు.

ప్రభుత్వాల చలవతో అంబానీలు, అదానీలు కుబేరులుగా మారుతున్నా.. తమలాంటి మూరుమూల ప్రాంత వాసులకి ఇంకా అభివృద్ధి ఫలాలు అందడంలేదు అని దేశవ్యాప్తంగా చాటి చెప్పేందుకే ఈ వినూత్న ప్రయోగం చేశారు. అంబానీ సేతు అనగానే అందరి దృష్టీ దానిపై పడింది. ఇంకేముంది ఆ వంతెన వార్తల్లోకెక్కింది, సంచలనంగా మారింది. రూ.6 లక్షల చందాతో 2వేల వెదురు కర్రలతో 250 అడుగుల పొడవున నిర్మించిన ఈ వంతెన అంబానీ పేరుతో టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. ఇలాగైనా ప్రభుత్వం దృష్టి తమ గ్రామంపై పడుతుందనే ఉద్దేశంతో అంబానీ పేరు పెట్టామని చెబుతున్నారు గ్రామస్తులు.

ప్రస్తుతం దీన్ని కేవలం నడక మార్గంగా మాత్రమే ఉపయోగిస్తున్నారు. నది నీటిమట్టం పెరిగితే ఈ వంతెన మునిగిపోతుంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ కష్టాలను గుర్తించాలని, శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు గ్రామస్తులు.

First Published:  9 Jan 2023 6:25 AM IST
Next Story