Telugu Global
National

అమెజాన్ కు షాక్, లాభాలకు బ్రేక్.. ఎందుకంటే..?

అమెజాన్ తోపాటు, ఇతర ఆన్ లైన్ డెలివరీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు సొంతగా మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. అమెజాన్ కమీషన్ భరించలేక, సొంతగా ఉత్పత్తులను ఆన్ లైన్ లో అమ్ముతున్నాయి.

అమెజాన్ కు షాక్, లాభాలకు బ్రేక్.. ఎందుకంటే..?
X

ఆన్ లైన్ డెలివరీ సంస్థ అమెజాన్ లాభాలకు బ్రేక్ పడింది. ఆన్ లైన్ వ్యాపారం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ లాభాలతో దూసుకెళ్తున్న అమెజాన్, కరోనా సమయంలో ఊహించని రీతిలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా అందరూ అమెజాన్ కి అలవాటు పడ్డారు. వ్యాపార సంస్థలు కూడా తమ ఉత్పత్తుల అమ్మకాలకు అమెజాన్ పై ఆధారపడ్డాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కంపెనీ చరిత్రలో తొలిసారిగా గతేడాది లాభాలు తగ్గుముఖం పట్టాయి. సగానికి సగం పడిపోయాయని తెలుస్తోంది.

అమెజాన్ కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే చేస్తుంది. వివిధ కంపెనీల ఉత్పత్తులకు తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ప్రచారం కల్పించి, వాటిని మార్కెటింగ్ చేస్తుంది. కస్టమర్లు ఆర్డర్ ఇస్తే కంపెనీలనుంచి ఉత్పత్తులను తెప్పించి వారికి డెలివరీ చేస్తుంది. దీనికోసం ఆయా ఉత్పత్తి సంస్థలనుంచి కమీషన్ తీసుకుంటుంది అమెజాన్. అయితే ఇటీవల కాలంలో కమీషన్ ని భారీగా పెంచేశారట. ఉత్పత్తుల రవాణా, గోడౌన్ల నిర్వహణ, డెలివరీ చార్జీలు, ఇలా.. అన్నిరకాలు కలుపుకొని కమీషన్లను అమెజాన్ భారీగా పెంచేసిందని అంటున్నారు. ఇంటిలో మంటకోసం ఉపయోగించే కుంపట్లు అమ్ముతుంటారు చెక్ గ్రెగోరిచ్. ఒక్కో కుంపటి ఖరీదు 200 డాలర్లు కాగా, అమెజాన్ కమీషన్ అందులో 112 డాలర్లుగా ఉందని అంటున్నారాయన. ఇలా చాలామంది అమెజాన్ బాధితులు తమ వ్యాపార విస్తరణకోసం మౌనంగానే వారి దోపిడీ భరిస్తూ వచ్చారు. చివరకు ఇప్పుడు ప్రత్యామ్నాయాల బాట పట్టారు. దీంతో అమెజాన్ లాభంలో కోతపడింది.

అమెజాన్ తోపాటు, ఇతర ఆన్ లైన్ డెలివరీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు సొంతగా మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. అమెజాన్ కమీషన్ భరించలేక, సొంతగా ఉత్పత్తులను ఆన్ లైన్ లో అమ్ముతున్నాయి. ఒకరినుంచి మరొకరికి ఈ పద్ధతి అలవాటైంది. దీంతో అమెజాన్ లో చాలా ఉత్పత్తులు ఇప్పుడు కనిపించడంలేదు. లాభాలు తగ్గిపోవడం వల్లే అమెజాన్ లో కూడా ఇటీవల భారీ లే ఆఫ్ ప్రకటించారు.

మొత్తమ్మీద కరోనా సమయంలో భారీ లాభాలను కళ్లజూసిన అమెజాన్, ఇప్పుడు క్రమంగా ఆ లాభాలను కోల్పోయే దశకు చేరుకుంది. కేవలం మధ్యవర్తిత్వం ద్వారా కమీషన్ వ్యాపారం చేస్తున్న అమెజాన్ కి చిన్న చిన్న కంపెనీలన్నీ గుడ్ బై చెప్పేస్తున్నాయి. ఈ ఏడాది కొత్తగా 8 శాతం కమీషన్ పెంచడంతో మరిన్ని చిన్న కంపెనీలు ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి.

First Published:  16 Feb 2023 6:36 PM IST
Next Story