రైలింజన్, మోదీ ఇమేజ్.. రెండిటికీ రిపేర్లు..
గేదెల యజమానిపై గుజరాత్ రైల్వే పోలీసులు కేసు పెట్టారు. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 147 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
వందే భారత్ రైలు ప్రారంభించి వారం గడవకముందే ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆ ఎక్స్ ప్రెస్ రైలుతో సహా, రైలుని అట్టహాసంగా ప్రారంభించిన ప్రధాని మోదీ పరువు కూడా మంటగలిసింది. దీంతో వెంటనే రైల్వే అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. 24 గంటలు గడవక ముందే రైలింజన్ రిపేర్ చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి హడావిడి చేశారు. రైలింజన్ రిపేర్ చేసి, మోదీ ఇమేజ్ కూడా రిపేర్ చేసే పనిలోపడ్డారు.
గేదెల యజమానిపై కేసు..
భారత్‌లో రైలు పట్టాలు ప్రభుత్వ ప్రాపర్టీయే అయినా.. వాటికి రక్షణ కంచెలు ఉండవు. అంటే రైల్వే స్టేషన్లు మినహా మిగతా చోట్ల.. మనుషులు, పశువులు పట్టాలపైకి రావడం పెద్ద వింత విశేషం కాదు. చాలా చోట్ల ప్రమాదాలు జరిగినా ఎవరిపై కేసులు పెట్టరు. కానీ ఇక్కడ వందే భారత్ ఎక్స్ ప్రెస్ విషయంలో ప్రభుత్వం పరువు పోయింది కాబట్టి వెంటనే గేదెల యజమానిపై గుజరాత్ రైల్వే పోలీసులు కేసు పెట్టారు. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 147 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గేదెల యజమాని ఇంకా కనిపించలేదని అతని కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
వాస్తవానికి అక్కడ గేదెల యజమాని బాధితుడు. అతనికి చెందిన నాలుగు గేదెలు ప్రమాదంలో మరణించాయి. చట్ట ప్రకారం అతనికి నష్టపరిహారం వస్తుందా లేదా, అనే విషయం పక్కనపెడితే అతడిపై కేసు పెట్టడం మాత్రం ఇక్కడ హైలెట్ అవుతోంది. అంతే కాదు, రైలింజన్ కి 24 గంటల్లో రిపేర్ చేశామని అధికారులు డబ్బా కొట్టుకోవడం అంతకంటే విచిత్రం. వందే భారత్ ఎక్స్ ప్రెస్, మేడిన్ ఇండియా హైస్పీడ్ రైల్ అని చెప్పుకొంటున్న కేంద్రం.. బుల్లెట్ ట్రైన్ కి ఇదే మొదలు అని పేర్కొంది. అంతలోనే ప్రమాదం జరగడంతో కేంద్రం పరువుపోయింది. దీంతో రైలింజన్‌తోపాటు, పోయిన పరువుకి కూడా రిపేర్ వర్క్ చేయాలని ప్రయత్నించారు అధికారులు.