Telugu Global
National

జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్

ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి కూడా పెద్ద సంఖ్యలో జాతీయ అవార్డులు వరించాయి. పుష్ప సినిమాకు రెండు జాతీయ అవార్డులు రాగా, ఆర్ఆర్ఆర్ మూవీకి ఏకంగా ఆరు జాతీయ అవార్డులు వచ్చాయి.

జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్
X

పుష్ప సినిమాలో నటనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్స‌వం జ‌రిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు అవార్డులు అంద‌జేశారు. ఈ దఫా ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి కూడా పెద్ద సంఖ్యలో జాతీయ అవార్డులు వరించాయి. పుష్ప సినిమాకు రెండు జాతీయ అవార్డులు రాగా, ఆర్ఆర్ఆర్ మూవీకి ఏకంగా ఆరు జాతీయ అవార్డులు వచ్చాయి.

పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక అయ్యాడు. ఒక తెలుగు హీరో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి. ఇక అల్లు అర్జున్ తో పాటు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (పుష్ప)గా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ పాటల రచయిత(కొండపొలం)గా చంద్రబోస్ రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకున్నారు.

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలువగా.. డైరెక్టర్ రాజమౌళి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు అందుకున్నాడు. అదే సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ అందించిన ఎం.ఎం. కీరవాణి, సింగర్ కాలభైరవ(కొమరం భీముడో సాంగ్), నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన శ్రీనివాస్ మోహన్, ఫైట్ మాస్టర్ సోలోమన్ రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా `ఉప్పెన` ఎంపిక కాగా, ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు నవీన్ ఏర్నేని, రవి శంకర్ రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు అందుకున్నారు.

First Published:  17 Oct 2023 5:08 PM IST
Next Story