Telugu Global
National

గెలుపుకోసం దొంగదార్లు... బీజేపీ ఓటర్ల దిగుమతి !

జమ్మూకశ్మీర్ లో స్థానికేత‌రులు ఓటు వేయడానికి అనుమతిస్తూ ఎన్నికల‌ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్థానిక పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఓట్లను దిగుమతి చేసుకునేందుకు బీజేపీ చేస్తున్న‌ కుట్ర అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

గెలుపుకోసం దొంగదార్లు... బీజేపీ ఓటర్ల దిగుమతి !
X

దేశ ప్రజల సంక్షేమం కోసం కొందరు ఆలోచిస్తే ఎలాగైనా అధికారంలోకి రావడమెలా అని మరికొందరు ఆలోచిస్తారు. అందుకోసం ఎన్ని దిగజారుడు పనులైనా చేయడానికి వెనకాడరు. సామ, దాన,భేద దండోపాయాలుపయోగిస్తారు. తిమ్మిని బమ్మిని చేస్తారు.

జమ్ము కశ్మీర్ లో గెలవడమే లక్ష్యంగా ఎత్తులు, జిత్తులకు పాల్పడుతోంది భారతీయ జనతాపార్టీ. అందుకోసం ఎప్పుడూ లేని విధంగా ఓటర్లను దిగుమతి చేసుకోవాలనుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

స్థానికేతరులు,ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులకు ఓటు హక్కు కల్పిస్తూ జమ్మూకశ్మీర్ ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి హిర్‌దేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూకశ్మీరులోని ఆర్మీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల సైనికులు కూడా వారి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి అనుమతించారు. ఈ నిర్ణయం జమ్ము కశ్మీర్ లోని ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపించనున్నది.

ఇది ఓటర్లను దిగుమతి చేసుకునే కుట్ర అని విపక్షాలు భగ్గుమ‌న్నాయి. స్థానికేతరులు ఓటు వేసేందుకు అనుమతించడం వినాశకరమని, బీజేపీకి అనుకూలంగా ఎన్నికల ఫలితాలను మార్చడానికి జరుగుతున్న కుట్ర అని జమ్ము కశ్మీర్ విపక్షాలు ఆరోపించాయి. జమ్ము కశ్మీర్ లో సీట్లు గెలవడానికి బిజెపి ఓటర్లను దిగుమతి చేసుకోవాలని చూస్తోందని J&K మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.

"J&Kలో స్థానిక‌ ఓటర్ల మద్దతు ఆ పార్టీకి లేదని బీజేపీకి అర్దమయ్యింది. అందుకే సీట్లు గెలవడానికి తాత్కాలిక ఓటర్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఏర్పడింది. అయితే ఈ అంశాలేవీ బీజేపీకి సహాయపడవు'' అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

స్థానికేతరులను అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించడం 1987లో జరిగిన రిగ్గింగ్ మాదిరిగానే వినాశకరమని పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్, మాజీ మంత్రి సజ్జాద్ లోన్ అన్నారు.

ఈ నిర్ణయం ఎన్నికల ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మలుచుకునేందుకు తీసుకున్న దారుణమైన చర్యగా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అభివర్ణించారు.

అయితే, బిజెపి మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇది భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) తీసుకున్న గొప్ప చర్యగా పేర్కొంది. నిజమైన ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడు అర్దమవుతుంది అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ అన్నారు.

First Published:  18 Aug 2022 8:31 AM GMT
Next Story