సహజీవన సంబంధాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సహజీవన సంబంధాలు ఆరోగ్యకరం కాదని స్పష్టం చేసింది. ఒక కేసులో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సహజీవన భాగస్వామికి బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
సహజీవన సంబంధాల పేరుతో భారత్‌లోని వివాహ వ్యవస్థను ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేస్తున్నారని అలహాబాద్ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సహజీవన సంబంధాలు ఆరోగ్యకరం కాదని స్పష్టం చేసింది. ఒక కేసులో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సహజీవన భాగస్వామికి బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఒక వ్యక్తికి వివాహ వ్యవస్థ అందించే సామాజిక భద్రత, అంగీకారం, స్థిరత్వం.. సహజీవన సంబంధాలు అందించవని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ప్రతి సీజన్‌లో భాగస్వామిని మార్చే ఈ క్రూరమైన భావన ఒక స్థిరమైన, ఆరోగ్యవంతమైన సమాజానికి లక్షణంగా పరిగణించలేమని తెలిపింది. వివాహ వ్యవస్థ కనుమరుగైన తర్వాతే మన దగ్గర ఈ బంధం సాధారణమవుతుందని పేర్కొంది.
వివాహ వ్యవస్థలో భాగస్వామితో నిజాయతీగా లేకపోవడం, సహజీవన సంబంధాలను కలిగి ఉండటం ప్రగతిశీల సమాజానికి సూచనలుగా ఇప్పుడు చెలామణీ అవుతున్నాయని తెలిపింది. అలాంటి ధోరణికి యువత ఆకర్షితులు కావడం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తీరుతో దీర్ఘకాలంలో చోటుచేసుకునే పరిణామాల పట్ల అవగాహన లేకపోవడమే అందుకు కారణమని న్యాయస్థానం వివరించింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి తన సహజీవన భాగస్వామిపై కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇచ్చిన మాట తప్పాడని పిటిషన్‌లో న్యాయస్థానానికి వివరించింది. ప్రస్తుతం తాను గర్భవతినని, తన భాగస్వామి పెళ్లికి అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే అత్యాచార ఆరోపణలు కూడా చేసింది. ఈ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది.