Telugu Global
National

థర్డ్‌ ఫ్రంట్ కాదు, మెయిన్ ఫ్రంట్..

ఇకపై విపక్షాల కూటమి థర్డ్‌ ఫ్రంట్ కాదని, మెయిన్ ఫ్రంట్ అని తేల్చి చెప్పారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఈ మెయిన్ ఫ్రంట్ 2024లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

థర్డ్‌ ఫ్రంట్ కాదు, మెయిన్ ఫ్రంట్..
X

ఎన్డీఏని గద్దె దించడానికి విపక్షాలు చేస్తున్న ఐక్య పోరాటంలో ఆదివారం మరో ముందడుగు పడింది. హర్యానాలోని ఫతేహాబాద్‌లో మాజీ ఉప ప్రధాని దేవీలాల్ 109వ జయంతి వేడుకల్లో విపక్ష కూటమి నాయకులు పాల్గొన్నారు. లోక్ దళ్ ఏర్పాటు చేసిన ఈ మహా సభకు ప్రతి పక్షాలకు చెందిన అగ్ర నేతలు హాజరయ్యారు. ఈ వేదికపైనే థర్ట్ ఫ్రంట్ బదులు ప్రతిపక్షాల మెయిన్ ఫ్రంట్ అనే పదం పుట్టుకొచ్చింది. ఇకపై విపక్షాల కూటమి థర్డ్‌ ఫ్రంట్ కాదని, మెయిన్ ఫ్రంట్ అని తేల్చి చెప్పారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఈ మెయిన్ ఫ్రంట్ 2024లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. విపక్షాల్లో అనైక్యత ఉందని చెప్పుకుంటున్న బీజేపీకి గట్టి సమాధానం ఇస్తామన్నారు. తనకు ప్రధాని పదవిపై ఆశలేదని మరోసారి స్పష్టం చేశారు. అందరి ఆశయం ఎన్డీఏని ఓడించడమేనన్నారు. కాంగ్రెస్ నాయకులెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోయినా ఆ పార్టీకి అత్యంత ప్రాధాన్యమిస్తూ విపక్ష నేతలు మాట్లాడారు. కాంగ్రెస్, వామప‌క్షాలు లేకుండా విపక్ష కూటమి లేదన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్తామని చెప్పారు.

ఈ సమావేశం తర్వాత సోనియా గాంధీతో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. హర్యానా సమావేశం వివరాలను సోనియాకు తెలియజేశారు నితీష్ కుమార్. కాంగ్రెస్ నేతృత్వంలో జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు జరగాలన్నారు. ఇందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని, దేవీలాల్ జయంతి సందర్భంగా జరిగిన బహిరంగ సభకు హాజరైన నేతలంతా కూటమి ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారని వివరించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక మరోసారి భేటీ అవుదామని సోనియా వారికి చెప్పారు.

నితీష్-లాలూ-సోనియా సమావేశంపై బీహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ స్పందించారు. ప్రతిపక్షాల కూటమి అనేది భ్రమ అని, కేజ్రీవాల్‌ను, కాంగ్రెస్‌ను కలపగలరా అని సుశీల్ మోదీ ప్రశ్నించారు. కూటమిలో ఒకరంటే ఒకరికి పడదని చెప్పారు. కూటమిలో అనైక్యతే తమకు లాభం చేకూర్చుతుందని బీజేపీ ఆశిస్తోంది. అదే సమయంలో కూటమిని బలంగా ఏర్పాటు చేసి, ప్రధాని పదవి విషయంలో అపోహలు, మనస్పర్థలు లేకుండా చేసి బీజేపీని గద్దెదించాలని భావిస్తున్నారు విపక్ష పార్టీల నేతలు.

First Published:  26 Sept 2022 7:41 AM IST
Next Story