'మోడీజీ..కపట ప్రేమలు వద్దు..'
ప్రధాని మోదీపై విమర్షలు గుప్పిస్తూ పస్మండ ముస్లిం మహజ్ (ఎఐపిఎంఎం) అధినేత అలీ అన్వర్ అన్సారీ మోదీకి బహిరంగ లేఖ రాశారు. బీజేపీ వెనకబడిన వర్గాల పట్ల కపటప్రేమ చూపిస్తోందని ఆయన మండిపడ్డారు
రాజ్యసభ మాజీ ఎంపి, అఖిల భారత పస్మండ ముస్లిం మహజ్ (ఎఐపిఎంఎం) అధినేత అలీ అన్వర్ అన్సారీ గురువారం ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో 'పస్మండ (వెనుకబడినవారు)' అనే పదాన్ని ఉపయోగించినందుకు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్భంలో అన్సారీ తీవ్రమైన పదజాలతో ప్రధాని పై పలు ప్రశ్నలు సంధించారు. ఇప్పటివరకూ ముస్లింలపై వస్తున్న విమర్శలకు, జరుగుతున్న అరాచకాలకు ఎందుకు స్పందించలేదని ఆయన లేఖ ద్వారా నిలదీశారు. వెనుకబడిన ముస్లింలు ఇంతకుముందు చర్చల్లో ఎందుకు పాల్గొనలేకపోయారని , ఇప్పుడు 'స్నేహ యాత్ర' నిర్వహించాలని బీజేపీ ఎందుకు ఆలోచిస్తోందని అన్వర్ ప్రశ్నించారు. తమకు కావాల్సింది కల్లబొల్లి ప్రేమలు, స్నేహాలు కాదని, సమానత్వం, గౌరవం, హోదా అని అన్సారీ స్పష్టం చేశారు.
ఇది మరీ ఆశ్చర్యం..!
పస్మండ ముస్లింల గురించి మీ నోటి నుండి వినడమే ఆశ్చర్యం అనుకుంటే వారి కోసం స్నేహ యాత్రలు చేయడం మరీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఓటు బ్యాంకు రాజకీయంగా కనబడుతోందని అన్సారీ అనుమానం వ్యక్తం చేశారు. వెనకబడిన సమాజం కోసం 'స్నేహ యాత్ర' చేపట్టడానికి "ఓటు బ్యాంకు రాజకీయాలతో సంబంధం ఉంది". "ముస్లింలను ఒకరిపై ఒకరిని ఎగదోయడం దీని లక్ష్యం కాదా? పస్మాండ ముస్లింలు ఏ పార్టీకి గుడ్డిగా మద్దతు ఇవ్వరు. వాటిని ఏ పార్టీ కూడా తమ వాళ్ళేనని ముందుగా భావించకూడదు.'' అని అన్నారు.
ఎఐపిఎంఎం రాజ్యాంగ పరిధిలోనే తమహక్కుల కోసం హోదా కోసం పోరాటం చేస్తుందని అన్సారీ ఉద్ఘాటించారు. ఇంకా అన్సారీ తనలేఖలో ఏమన్నారంటే.. "వెనకబడిన ముస్లింలుగా మేము ప్రత్యేకంగా ఏదో ఒక గుర్తింపు కోసం అడగడంలేదు. ప్రభుత్వం మాపై చూపుతున్న వివక్షను తక్షణమే ఆపాలని ముస్లింలుగా కోరుతున్నాం. మా క్రైస్తవ దళితులది కూడా అదే డిమాండ్. క్రైస్తవులుగా ఉన్నందుకు శిక్షలు కూడా అనుభవిస్తున్నారు. ఈ యుద్ధంలో వెనకబడిన ముస్లింలు మాత్రమే గెలవలేరని మేము మొదటి నుంచీ గట్టి నమ్మకంతో ఉన్నాము. అన్ని మతాలకు చెందిన వెనకబడిన దళితులు, ఇతర ప్రగతిశీల,న్యాయాన్ని ప్రేమించే వ్యక్తుల సహాయంతో మాత్రమే మేము విజయం సాధించగలము." అని పేర్కొన్నారు.
బుల్డోజర్లతో తొక్కేసినా మౌనంగా ఉన్నారు..
"పస్మాండ ముస్లింల కోసం 'స్నేహ యాత్ర' చేయాలని మీరు మీ పార్టీ సభ్యులను కోరారు. సమాజంలో మత సామరస్యాన్ని కాపాడినప్పుడే ఇది సఫలీకృతమవుతుంది. ద్వేషపూరిత ప్రకటనలు, బుల్‌డోజర్లతో తొక్కేయడం వంటి సంఘటనలు కొనసాగితే 'స్నేహ యాత్ర' చేపట్టడంలో అర్థం ఏమిటి? ఎందుకు మౌనంగా ఉన్నారు "అని సూటిగా నిలదీశారు. "కరోనా సమయంలో గోసంరక్షణ, ఘర్-వాపసీ, లవ్ జిహాద్, తబ్లిఘి జిహాద్ లేదా 2014 నుండి కొనసాగుతున్న ఏదైనా దేవాలయం-మసీదు వివాదంలో గోసంరక్షణ పేరుతో జరిగిన మూక హత్యలన్నింటిలో పస్మాండ వెనకబడిన అత్యంత దారుణంగా హింసకు గురయ్యారు. పోలీసు కేసుల్లో చిక్కుకుని జైలుకెళ్లిన వారిలో ఎక్కువ మంది నెనకబడిన ముస్లింలే" అని అన్సారీ ప్రధానికి రాసి లేఖలో పేర్కొన్నారు.
గతంలో ముస్లింలపై బీజేపీ సీనియర్ నేతలు చేసిన కొన్ని తీవ్ర వ్యాఖ్యలను కూడా అన్సారీ ప్రస్తావించారు . "ముస్లింలు రెచ్చిపోకుండా శాంతంగా ఉన్నపుడు వారి ప్రార్థనలకు అంతరాయం కలిగించలేదా, వారి మసీదులపై దాడులు జరగలేదా"వారి ప్రవక్తపై దూషణ జరగలేదా? దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా మన దేశం ప్రతిష్ట మసకబారుతూనే ఉన్నా, మీరు ఇప్పటి వరకు దానిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు.. పైగా జరుగుతున్న అక్రమాలకు,అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పిన ముస్లింలు, మేధావులు, పాత్రికేయులు, ప్రజా సంఘాల కార్యకర్తలను కటకటాల వెనక్కి నెట్టుతున్నారు'' అని లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఎఐపిఎంఎం ఎప్పుడూ "మతవాదానికి వ్యతిరేకంగా గొంతు విప్పిపోరాడుతోందని" అన్సారీ అన్నారు. బీజేపీ తమ ఓట్ల కోసం పస్మందాస్ కు నిజంగా స్నేహ హస్తం చాచుతున్నట్టయితే వారు కోరుకుంటున్నట్టు వారికి సమానత్వం, గౌరవం, హోదా కల్పించగలరా " అని ప్రశ్నించారు. అలా చేయలేకుంటే ఊరికనే గప్పాలు కొట్టుకుంటున్నంత మత్రాన ఫలితమేమీ ఉండదని ఎఐపిఎంఎం అధినేత అలీ అన్వర్ అన్సారీ తన లేఖలో ఘాటుగా విమర్శించారు.