నూపుర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో జిహాద్ కు అల్-ఖైదా పిలుపు
నుపుర్ శర్మపై ప్రతీకారం తీర్చుకోవాలని అల్-ఖైదా పిలుపునిచ్చింది.శత్రువులకు వ్యతిరేకంగా తమకు తాము ఆయుధాలుగా మారి జిహాద్ లో పాల్గొనాలని కూడా అల్-ఖైదా తన కార్యకర్తలను కోరింది.
మహ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ పై ప్రతీకారం తీర్చుకోవాలని అల్-ఖైదా పిలుపునిచ్చిందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఈమేరకు అల్-ఖైదా మౌత్ పీస్ 'నవా-ఎ-ఘవా-ఎ-హింద్' లో నూపుర్ శర్మ చేసిన "దైవ దూషణ" వ్యాఖ్యల గురించి వివరంగా ఉటంకిస్తూ ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చిందని ఆ పత్రిక పేర్కొంది. శత్రువులకు వ్యతిరేకంగా తమకు తాము ఆయుధాలుగా మారి జిహాద్ లో పాల్గొనాలని,కశ్మీర్ లో కూడా " జిహాద్"లో పాల్గొనాలని అల్-ఖైదా పిలుపునిచ్చిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
రచయిత సాల్మన్ రష్దీ పై ఇటీవల అమెరికాలో జరిగిన హత్యాయత్నం నేపథ్యంలో ఇంటిలిజెన్స్ వర్గాలు హైఅలర్ట్ లో ఉన్నాయి. భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేస్తామని ఈ యేడాది జూన్ లో ఇస్లామిక్ స్టేట్ ఖుర్సన్ ప్రావిన్స్-ఐఎస్ కె పి హెచ్చరించింది. అంతకుముందు, భారత్‌పై దాడులు చేయాలంటూ 50 పేజీల డాక్యుమెంట్ ను ఐఎస్ కెపి విడుదల చేసింది.
ప్రవక్త మొహమ్మద్‌ను అవమానించినందుకు ప్రతీకారంగా భారతీయ నగరాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు చేస్తామని హెచ్చరిస్తూ అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఎక్యుఐఎస్) కూడా లేఖ విడుదల చేసింది.
జూన్ 6 నాటి బెదిరింపు లేఖలో, ప్రవక్త గౌరవాన్నికాపాడేందుకు ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో ఆత్మాహుతి దాడులు చేస్తామని ఎక్యుఐఎస్ పేర్కొంది. ఈ ముప్పు గురించి అన్ని రాష్ట్రాలకు నిఘా వర్గాలు సమాచారం అందించి అప్రమత్తం చేశాయి.
నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య కుమార్, అమరావతి ఫార్మసిస్ట్ ఉమేష్ కోల్హేలను హత్య చేసిన నేపథ్యంలో ఈ బెదిరింపులు వచ్చాయి.
ప్రవక్తపై శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, హింసాత్మక నిరసనలు జరిగినప్పటినుంచి ఆమె ఒక గుర్తు తెలియని ప్రదేశంలో పోలీసు రక్షణలో ఉంటున్నారు. హత్య చేస్తామంటూ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఇటీవల ఆమెకు భద్రతను పెంచారు.