అన్ని నిబందనలను తుంగలో తొక్కి అదానీకి సహకరించిన మోడీ సర్కార్... బహిర్గతపర్చిన అల్ జజీరా
బొగ్గు బ్లాకులను ప్రయివేటు రంగానికి అప్పగించే ప్రత్యేక నిబంధన సరైనదికాదని, దాంట్లో పారదర్శకత లోపించిందని ప్రధాని కార్యాలయం నిర్ధారించిన తర్వాత కూడా మోడీ సర్కార్ అదానీ సంస్థకు మినహాయింపు ఇచ్చింది.
బొగ్గు తవ్వకాలకు సంబంధించి మోడీ సర్కార్, సుప్రీం కోర్టు తీర్పుతో సహా అన్ని నిబందనలను తుంగలో తొక్కి అదానీ సంస్థకు అనుకూలంగా పని చేసిందని అల్ జజీరా నివేదిక బహిర్గతపర్చింది.
బొగ్గు బ్లాకులను ప్రయివేటు రంగానికి అప్పగించే ప్రత్యేక నిబంధన సరైనదికాదని, దాంట్లో పారదర్శకత లోపించిందని ప్రధాని కార్యాలయం నిర్ధారించిన తర్వాత కూడా మోడీ సర్కార్ అదానీ సంస్థకు మినహాయింపు ఇచ్చింది. “ 450 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ బొగ్గును కలిగి ఉన్న బ్లాక్ నుండి బొగ్గు తవ్వడానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ను ప్రభుత్వం అనుమతించింది. ఏ ప్రైవేటు సంస్థకూ ఇవ్వకుండా ఒక్క అదానీ గ్రూప్‌కు మాత్రమే ఎందుకు మినహాయింపు ఇచ్చారో ప్రభుత్వం వివరించలేదు, ”అని అల్ జజీరా నివేదిక పేర్కొంది.
కాగా, గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన 204 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేస్తూ 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. చాలా బ్లాక్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేటు కంపెనీలకు అక్రమంగా కేటాయించాయని కోర్టు గుర్తించింది. ఈ కంపెనీలు రహస్య ఒప్పందాలతో అతి తక్కువ ధరలకు మైనింగ్ బ్లాక్ లను పొందాయి. అదానీ కంపెనీ కూడా అలాగే జూలై 2008లో కాంట్రాక్టును చేజిక్కించుకుందని నివేదిక పేర్కొంది.
చట్టసభల అనుమతి లేకుండా ఇదంతా సాగిందని గుర్తించిన కోర్టు , తన తీర్పులో, అన్ని బొగ్గు బ్లాకులను, మైనింగ్ కాంట్రాక్టులను రద్దు చేసి, కంపెనీలను జప్తు చేసింది.
గత యూపీఏ ప్రభుత్వం బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి బదులుగా, గనులకు కనీస రాయల్టీని వసూలు చేయడం ద్వారా ప్రైవేటు కంపెనీలకు కేటాయించింది. దీని వల్ల ఖజానాకు 22 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వ ఖాతా ఆడిటర్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తేల్చి చెప్పింది.
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెండర్లు లేకుండా కంపెనీలకు బొగ్గు బ్లాకులు ఇవ్వడం ఆగిపోయింది. టెండర్ల ద్వారా మాత్రమే బొగ్గు బ్లాకులను కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదానీ కంపెనీకి మినహాయింపు ఇచ్చారు.కోర్టు తీర్పుతో పాటు ప్రభుత్వ స్వంత విధాన నిర్ణయాల వల్ల అనేక ఇతర ప్రైవేట్ సంస్థలు నష్టపోయాయి. అదానీమాత్రం ఈ రోజు వరకు 80 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును తవ్వినట్లు నివేదిక పేర్కొంది.
ఈ అంశంపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు మహువా మోయిత్రా ఒక ట్వీట్‌లో, “బొగ్గు గనుల కేటాయింపును సుప్రీంకోర్టు రద్దు చేసింది. మోడీ సర్కార్ మాత్రం ఎటువంటి వేలం లేకుండా నేరుగా తన ప్రత్యేక స్నేహితుడికి మాత్రమే బొగ్గు బ్లాకులు కేటాయించింది. ఆ తర్వాత, మిగతావాళ్ళందరికీ తలుపులు మూసివేసింది. మిగతా వారందరూ టెండర్ల ద్వారానే కొనుగోలు చేయాలని చెప్పింది.'' అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంటూ అల్ జజీరా కథనానికి సంబంధించిన లింక్‌ను కూడా పోస్ట్ చేశారు.