Akshay Kumar: ఎట్టకేలకు అక్షయ్‌కి భారతీయ పౌరసత్వం
Akshay Kumar: 2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీని అక్షయ్ ఇంటర్వ్యూ చేసిన సమయంలో పౌరసత్వం విషయంలో అక్షయ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పౌరసత్వం విషయంలో అక్షయ్ కుమార్ తరచూ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తనకు కెనడా పౌరసత్వం ఉందన్న విషయాన్ని అక్షయ్ గతంలో వెల్లడించారు. అందుకు కారణం కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
అదేమిటంటే.. '1990లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. వరుసగా 15 సినిమాలు పరాజయం పాలయ్యాయి. కెనడాలో ఉన్న స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసమే పాస్‌పోర్టు కోసం అప్లయ్ చేశా. అప్పుడే కెనడా పాస్‌పోర్టు వచ్చింది. అంతలోనే అప్పటికే నటించిన రెండు సినిమాలు ఇండియాలో ఘన విజయం సాధించడంతో కెనడాకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఈ క్రమంలోనే పాస్‌పోర్టు విషయం మరిచిపోయా. అందుకే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా' అని అక్షయ్ తెలిపారు. 2019లో ఆయన భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా.. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రక్రియ ఆలస్యమైంది.
Dil aur citizenship, dono Hindustani.
— Akshay Kumar (@akshaykumar) August 15, 2023
Happy Independence Day!
Jai Hind! pic.twitter.com/DLH0DtbGxk
2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీని అక్షయ్ ఇంటర్వ్యూ చేసిన సమయంలో పౌరసత్వం విషయంలో అక్షయ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారతీయులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అప్పట్లో కోరారు. అయితే.. ఓటు హక్కు లేని వ్యక్తి భారత పౌరులకు ఓటింగ్ కోసం పిలుపునివ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆయన అప్పట్లోనే వివరణ ఇచ్చారు. భారత్ పౌరసత్వాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నానని, పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నానని పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనకు 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత పౌరసత్వం లభించింది. 'నా హృదయం.. పౌరసత్వం.. రెండూ హిందుస్థానీ. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు' అని ఆయన తన తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు. అక్షయ్‌కుమార్ నటించిన ఓ మై గాడ్ -2 (OMG-2) చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.