Telugu Global
National

అపచారం అపచారం.. గంగా విలాస్ లో బార్..!

గంగా నదిలో ఆ నౌక గత 17 ఏళ్లుగా నడుస్తోందని తనకు సమాచారం ఉందన్నారు అఖిలేష్ యాదవ్. చాన్నాళ్లుగా సేవలందిస్తున్న ఆ నౌకకు పేరు మార్చి, దానిలో ఓ బార్ ఏర్పాటు చేసి, కొత్త నౌకలాగా తెరపైకి తేవడమేంటని ప్రశ్నించారాయన.

అపచారం అపచారం.. గంగా విలాస్ లో బార్..!
X

ప్రపంచంలోనే అతి పెద్ద నదీయాన విహార నౌక గంగా విలాస్ అంటూ ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ గొప్పలు చెప్పుకున్నారు. ఈ నౌకతో భారత్ లో పర్యాటకరంగం కొత్త పుంతలు తొక్కుతుందని కూడా గర్వంగా చెప్పుకొచ్చారు. దీని ప్రత్యేకతలు అవీ ఇవీ అంటూ బీజేపీ నేతలు వారం రోజులుగా హడావిడి చేస్తున్నారు. బీజేపీ ఘతన ఇదీ అంటున్నారు. అయితే ఆఘనతతో పాటు వారు గంగానదిని అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. పవిత్ర గంగానదిలో ప్రయాణించే గంగా విలాస్ లో మద్యం సేవించేందుకు బార్ కూడా ఏర్పాటు చేశారని ఆరోపించారు.

విహార నౌక గంగా విలాస్ లో స్పా, జిమ్, సెలూన్ వంటి సౌకర్యాలున్నాయనే విషయం తెలిసిందే. అన్నిరకాల వెజిటేరియన్ వంటకాలకోసం మంచి హోటల్ కూడా ఉంది. అయితే మద్యం సరఫరా చేసేందుకు బార్ కూడా ఇందులో ఏర్పాటు చేశారనేది అఖిలేష్ ఆరోపణ. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన బీజేపీ నేతల్ని డిమాండ్ చేశారు.

పాత నౌకనే కొత్తగా ప్రారంభిస్తారా..?

గంగా నదిలో ఆ నౌక గత 17 ఏళ్లుగా నడుస్తోందని తనకు సమాచారం ఉందన్నారు అఖిలేష్ యాదవ్. చాన్నాళ్లుగా సేవలందిస్తున్న ఆ నౌకకు పేరు మార్చి, దానిలో ఓ బార్ ఏర్పాటు చేసి, కొత్త నౌకలాగా తెరపైకి తేవడమేంటని ప్రశ్నించారాయన. పాతవాటిని మళ్లీ మళ్లీ ప్రారంభించే సంప్రదాయం బీజేపీకి ఉందన్నారాయన. ప్రచారం చేసుకోవడం, అబద్ధాలు చెప్పడంలో బీజేపీ వాళ్లు చాలా ముందుంటారని విమర్శించారు.

అంతా విదేశీయులే..

గంగా విలాస్ తొలి ట్రిప్ లో స్విట్జర్లాండ్ కి చెందిన 32మంది ప్రయాణిస్తున్నారు. మొత్తం ఇందులో 36మంది పర్యాటకులకు ఎంట్రీ ఉంది. గంగా విలాస్ పూర్తి ట్రిప్ 51రోజులపాటు ఉంటుంది. ఒక్కొకరికి 20 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ నౌకా ప్రయాణానికి 2024 ఏప్రిల్‌ వరకు బుకింగ్‌ లు ముందుగానే పూర్తయ్యాయి. అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన పర్యాటకులు ఎక్కువగా గంగా విలాస్ ని బుక్ చేసుకున్నారు.

First Published:  15 Jan 2023 2:34 PM IST
Next Story