Telugu Global
National

'ఇండియా కూటమి'లో నితీష్ ఉంటే ఆయనే ప్రధాని

నితీష్ బీజేపీ వైపు వెళ్తున్నట్లు వస్తున్న వార్తలపై తాజాగా 'ఇండియా కూటమి'లోనే ఉన్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు.

ఇండియా కూటమిలో నితీష్ ఉంటే  ఆయనే ప్రధాని
X

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్లీ బీజేపీతో చేతులు కలుపుతున్నారని వస్తున్న వార్తలు 'ఇండియా కూటమి'లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. 'ఇండియా కూటమి' ఏర్పాటులో, ఆ కూటమి బలోపేతంలో నితీష్ చొరవ ఎంతో ఉంది. దేశవ్యాప్తంగా పర్యటించిన నితీష్ పలు పార్టీల అధినేతలను కలిసి 'ఇండియా కూటమి'లో భాగం చేసేందుకు ఎంతో కృషిచేశారు. అటువంటి నితీష్ ఇప్పుడు మళ్లీ బీజేపీ వైపు వెళ్తే 'ఇండియా కూటమి' విచ్ఛిన్నమైపోతుందని ప్రచారం జరుగుతోంది.

నితీష్ బీజేపీ వైపు వెళ్తున్నట్లు వస్తున్న వార్తలపై తాజాగా 'ఇండియా కూటమి'లోనే ఉన్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'ఇండియా కూటమి'లో నితీష్ కుమార్ ఉంటే ప్రధానమంత్రి అయ్యేవారని అభిప్రాయపడ్డారు.

నితీష్ కుమార్ చొరవ తీసుకుని ప్రతిపక్ష 'ఇండియా కూటమి' ఏర్పాటులో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన కూటమి నుంచి వెళ్లకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. నితీష్ మళ్లీ బీజేపీతో చేతులు కలుపుతున్నారని వస్తున్న వార్తలు తనను అసంతృప్తికి గురిచేశాయన్నారు. నితీష్ కూటమిలో కొనసాగితే ప్రధాని అవుతారని చెప్పారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో తాను ఎప్పుడు పాల్గొంటాననే విషయాన్ని సరైన సమయంలో చెబుతానని వెల్లడించారు. 'ఇండియా కూటమి' నుంచి వైదొలిగి ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. ఇవాళో, రేపో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కూడా ఇండియా కూటమి నుంచి వెళ్ళిపోతున్నారని వార్తలు వస్తుండడంతో కూటమి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

First Published:  26 Jan 2024 9:06 PM IST
Next Story