Telugu Global
National

కాంగ్రెస్ కు మద్దతుపై మమతతో ఏకీభవిస్తున్నా.. అఖిలేష్ వ్యాఖ్యలు

2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ పార్టీకే మద్దతు ఇస్తామని ఆమె ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని మమత కోరారు.

కాంగ్రెస్ కు మద్దతుపై మమతతో ఏకీభవిస్తున్నా.. అఖిలేష్ వ్యాఖ్యలు
X

కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీకే మద్దతు ఇస్తామని ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే మమతా బెనర్జీ చేసిన ప్రకటనతో తాను ఏకీభవిస్తున్నట్లు తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు నితీష్ కుమార్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వంటి నేతలు ప్రయత్నిస్తున్నారు.

నితీష్ కుమార్ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ పార్టీల అధినేతలను కలిసి చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఆయన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలను కలిశారు. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అక్కడ ఎన్నికలకు ముందు రోజు విద్వేషాన్ని రగిల్చే పార్టీకి ఓటు వేయొద్దని మమతా బెనర్జీ కర్ణాటక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత కాంగ్రెస్ పార్టీకి ఒక విజ్ఞప్తి చేసింది.

2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ పార్టీకే మద్దతు ఇస్తామని ఆమె ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని మమత కోరారు. కాగా, మమత చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తాజాగా అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే అక్కడే పోటీ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్, తెలంగాణ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, కేసీఆర్ కూడా గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు. కర్ణాటకలో బీజేపీపై కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీల్లో ఉత్సాహం వచ్చింది.

First Published:  17 May 2023 5:18 AM GMT
Next Story