Telugu Global
National

బీజేపీలోకి అనిల్ ఆంటోనీ.. బాధపడ్డ ఏకే ఆంటోనీ

కాంగ్రెస్ కి వీర విధేయుడైన ఏకే ఆంటోనీ.. తన తనయుడు పార్టీ మారడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు తీసుకున్న నిర్ణయం తప్పు అన్నారు.

బీజేపీలోకి అనిల్ ఆంటోనీ.. బాధపడ్డ ఏకే ఆంటోనీ
X

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసినా, కొన్నాళ్లు మౌనంగా ఉన్నారు. తాజాగా ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో అనిల్ బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా నాయకత్వంతో ప్రేరణపొంది ఆ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు అనిల్ ఆంటోనీ. అయితే కాంగ్రెస్ కి వీర విధేయుడైన ఏకే ఆంటోనీ.. తన తనయుడు పార్టీ మారడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు తీసుకున్న నిర్ణయం తప్పు అన్నారు. ఆ విషయం తెలిశాక తాను ఎంతగానో బాధపడ్డానని చెప్పారు ఏకే ఆంటోనీ.

దేశాన్ని విభజించేందుకు, ప్రజాస్వామ్య పునాదులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తానెప్పటికీ సమర్థించబోనని, తన కొడుకు అటువైపు ఆకర్షితుడవడం తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు ఏకే ఆంటోనీ. కాంగ్రెస్‌ పార్టీకి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి తాను విధేయుడిగా ఉన్నానని, ఎప్పటికీ అదే పార్టీలో ఉంటానని చెప్పుకొచ్చారు. భారతదేశాన్ని ఏకతాటిపై ఉంచడంతోపాటు భిన్నత్వాన్ని గౌరవించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందన్నారు ఏకే ఆంటోనీ.

ఇందిర స్ఫూర్తి..

రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను ఇందిరా గాంధీ నుంచి ఎంతో స్ఫూర్తి పొందాననని చెప్పారు ఏకే ఆంటోనీ. కొన్నాళ్లు పార్టీకి దూరమైనా.. ఆ తర్వాత తిరిగొచ్చి ఇందిరను మరింత గౌరవించానని ఆనాటి రోజులు గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ జీవితం చివరి దశలో ఉందని, ఇంకా ఎంతకాలం బతుకుతానో తనకు తెలియదని చెప్పారు. జీవించినంత కాలం కాంగ్రెస్‌ కోసమే పనిచేస్తానన్నారు.

First Published:  6 April 2023 8:20 PM IST
Next Story