ఆశీర్వాదం కోరిన వెన్నుపోటు వీరులు.. శరద్ పవార్ ఏమన్నారంటే..?
వెన్నుపోటు వీరులంతా ఒక్కసారిగా కలసి వచ్చి ఆశీర్వాదం కోరే సరికి శరద్ పవార్ కూడా షాక్ కి గురైనట్టు తెలుస్తోంది. పార్టీని తిరిగి ఐకమత్యంగా ఉంచాలని వారు శరద్ పవార్ కి విజ్ఞప్తి చేశారు.
ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చి సంచలనం సృష్టించిన అజిత్ పవార్ వర్గం పెద్దాయన శరద్ పవార్ ఆశీస్సుల కోసం వచ్చి మరింత కలకలం రేపింది. పార్టీని చీల్చినరోజే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలు.. ఇటీవలే శాఖలు ఖరారు చేసుకుని శరద్ పవార్ ఆశీర్వాదం కోసం తరలి వచ్చారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తోపాటు, ప్రపుల్ పటేల్, ఛగన్ భుజ్ బల్, దిలీప్ పాటిల్ వంటి నేతలు ముంబైలోని వైబీ చవాన్ సెంటర్ లో శరద్ పవార్ ని కలిశారు. ముందస్తు సమాచారం లేకుండానే తాము ఆయన ఆశీర్వాదం కోసం వచ్చామన్నారు నేతలు.
వెన్నుపోటు వీరులంతా ఒక్కసారిగా కలసి వచ్చి ఆశీర్వాదం కోరే సరికి శరద్ పవార్ కూడా షాక్ కి గురైనట్టు తెలుస్తోంది. చీలిక గ్రూప్ ప్రభుత్వంలో చేరిన తర్వాత బాబాయ్, అబ్బాయ్ మధ్య మాటల యుద్ధం కూడా ముదిరింది. అసలైన పార్టీ మాదంటే మాదంటూ రెండు వర్గాలు విమర్శలు సంధించుకున్నాయి. ఒకరిద్దరు అటునుంచి ఇటు ఇటునుంచి అటు గోడ దూకారు. చివరకు ఏ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారనేది స్పష్టత లేకపోయినా మెజార్టీ వర్గం అజిత్ పవార్ తోనే బయటకు వెళ్లిపోయిందనేది స్పష్టంగా తెలుస్తోంది. తమదే అసలైన ఎన్సీపీ అంటూ అజిత్ వర్గం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం కూడా సంచలనంగా మారింది.
పార్టీని ఐకమత్యంగా ఉంచుదాం..
తమ తప్పుని మన్నించమని కోరుతూనే పార్టీని తిరిగి ఐకమత్యంగా ఉంచాలని వారు శరద్ పవార్ కి విజ్ఞప్తి చేశారు. అయితే వారి విజ్ఞప్తిపై శరద్ పవార్ స్పందించలేదని తెలుస్తోంది. సైలెంట్ గా ఉన్నారాయన. పార్టీని చీల్చి ప్రభుత్వంలో చేరడంతోపాటు.. శరద్ పవార్ కి వయసైపోయిందంటూ సెటైర్లు పేల్చి ఇప్పుడు ఆయన దగ్గరకే రావడం అజిత్ రాజకీయ చాణక్యానికి నిదర్శనం అంటున్నారు నేతలు. అయితే అబ్బాయ్ కంటే రెండాకులు ఎక్కువే చదివిన బాబాయ్ సైలెంట్ గా తన పని తాను చేసుకు వెళ్తున్నారు.