Telugu Global
National

బాబాయ్ తో అబ్బాయ్ భేటీ.. కాంగ్రెస్ కి 'పవార్'లు హ్యాండిస్తారా..?

ఇప్పుడిప్పుడే విపక్షాల బలం, బలగం పెరుగుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ దశలో ఎన్సీపీలాంటి బలమైన పార్టీ కాంగ్రెస్ కి హ్యాండిస్తే మాత్రం విపక్ష కూటమికి అది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.

బాబాయ్ తో అబ్బాయ్ భేటీ.. కాంగ్రెస్ కి పవార్లు హ్యాండిస్తారా..?
X

మహారాష్ట్రలో కాంగ్రెస్ కి నమ్మకమైన మిత్రపక్షం ఎన్సీపీ. షిండేసేన ప్రభుత్వాన్ని కూల్చేసినా కూడా మహావికాస్ అఘాడీలోనే కొనసాగింది ఎన్సీపీ. అయితే సడన్ గా అజిత్ పవార్ కూడా బాబాయ్ శరద్ పవార్ కి హ్యాండిచ్చి ప్రభుత్వంతో కలసిపోయారు. అప్పుడు కూడా పెద్దాయన తొణకలేదు. తాను బీజేపీతో కలిసేది లేదన్నారు, పోయినోళ్లు ఎప్పటికైనా రాకపోరు అంటూ వేదాంతం మాట్లాడారు. తీరా ఇప్పుడు బాబాయ్ ని బుజ్జగించే పనిలో పడింది అబ్బాయ్ టీమ్. 24గంటల వ్యవధిలో రెండుసార్లు శరద్ పవార్ తో భేటీ అయింది అజిత్ పవార్ బృందం. పార్టీ అంతా ఒక్కటిగా ఉండేలా చూడాలని కోరింది.

బీజేపీ వైరి వర్గాలన్నీ ఏకతాటిపైకి వస్తున్న వేళ.. ఈరోజునుంచి బెంగళూరులో కీలక సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ దశలో ఎన్సీపీ ఈ సమావేశాలకు హాజరవుతుందా, దూరంగా ఉంటుందా అనేది తేలాల్సి ఉంది. రేపటినుంచి విపక్షాల సమావేశాలకు ఎన్సీపీ హాజరవుతుందని అంటున్నారు. మరి ఈరోజు అజిత్ పవార్ రాయబారం ఫలించిందా లేదా అనేది రేపటి విపక్ష భేటీకి ఎన్సీపీ హాజరునిబట్టి తేలిపోతుంది.

శివసేనను చీల్చిన సీఎం ఏక్ నాథ్ షిండే కూడా ఎప్పుడూ ఉద్ధవ్ థాక్రేని కలవలేదు. విడిపోయిన తర్వాత తనదే అసలైన శివసేన అన్నారు, దాని ప్రకారమే పేరు, గుర్తు న్యాయపోరాటం చేసిమరీ గెలుచుకున్నారు. కానీ ఎన్సీపీని మాత్రం అజిత్ పవార్ వర్గం చీల్చాలనుకోవడంలేదు. పార్టీ అంతా కలిసే ఉందామని, మహారాష్ట్ర ప్రభుత్వంతోటే ఉందామని శరద్ పవార్ ని ఒప్పించాలని చూస్తోంది. ఇప్పటికే బయటకు వెళ్లిన అజిత్ వర్గం మంత్రి పదవులు దక్కించుకుని సంతోషంగా ఉంది, మెజార్టీ ఎమ్మెల్యేలు వారితోటే ఉన్నారు. కానీ శరద్ పవార్ ని కూడా తమవైపు లాక్కొని.. కాంగ్రెస్ కూటమిని మరింత బలహీన పరచాలని అనుకుంటున్నారు. ఇది బీజేపీ వ్యూహమే అయినా, దాన్ని అమలు చేసే బాధ్యత అజిత్ పవార్ తీసుకున్నారు. మరి శరద్ పవార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇప్పుడిప్పుడే విపక్షాల బలం, బలగం పెరుగుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ దశలో ఎన్సీపీలాంటి బలమైన పార్టీ కాంగ్రెస్ కి హ్యాండిస్తే మాత్రం విపక్ష కూటమికి అది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.

First Published:  17 July 2023 5:02 PM IST
Next Story