Telugu Global
National

ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత.. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందులు

శనివారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 309గా నమోదయింది. నగరంలోని మధురా రోడ్డు, బారఖాంబా రోడ్డు, ప్రగతి మైదానం ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది.

ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత.. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందులు
X

ఢిల్లీలో వాయు నాణ్యత కొన్నేళ్లుగా క్షీణిస్తూ వస్తోంది. వాయు నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ మెరుగుపడటం లేదు. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పరిమిత సంఖ్యలోనే వాహనాలు నడిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీపావళి సంబరాలను జరుపుకోవడానికి కూడా కేజ్రీవాల్ సర్కార్ అనుమతించలేదు. అయితే టపాసులు కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ ప్రజలు లెక్కచేయలేదు. పండగ సందర్భంగా భారీగా టాపాసులు పేల్చడంతో గతంతో పోలిస్తే వాయు నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.

శనివారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 309గా నమోదయింది. నగరంలోని మధురా రోడ్డు, బారఖాంబా రోడ్డు, ప్రగతి మైదానం ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ ప్రాంతాల్లో ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉందని ప్రజలు చెబుతున్నారు. గాలిలో సంభవిస్తున్న మార్పులు కూడా కళ్ళకు కనిపిస్తున్నట్లు వారు తెలుపుతున్నారు. ఢిల్లీలో వాయు నాణ్యత తీవ్రస్థాయికి పడిపోయినప్పటికీ ప్రజలు విధిలేని పరిస్థితిలో పనులు చేసుకునేందుకు బయటకు వస్తున్నారు.

సాధారణంగా గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య వరకు ఉంటే స్వచ్ఛమైన వాయువు ఉన్నట్లు అర్థం. అదే 51 నుంచి 100 వరకు నాణ్యత ఉన్నా బాగున్నట్లే. 101 నుంచి 200 వరకు ఉంటే వాయు నాణ్యత కొంత తగ్గినట్లు అర్థం. 201 నుంచి 300 వరకు ఉంటే గాలిలో నాణ్యత మరీ తక్కువగా ఉందని, 301 నుంచి 400 వరకు ఉంటే గాలిలో నాణ్యత అసలు లేదని, ఇక 401 నుంచి 500 వరకు ఉంటే ప్రమాదకర స్థాయిగా పరిగణించడం జరుగుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో వాయు నాణ్యత 309గా నమోదు కావడంతో అత్యల్ప స్థాయికి వాయు నాణ్యత పడిపోయింది.

First Published:  29 Oct 2022 6:40 AM GMT
Next Story