30 విమానాలను ప్రవేశపెట్టనున్న ఎయిర్ ఇండియా
రాబోయే 15 నెలల్లో 5 వైడ్-బాడీ బోయింగ్, 25 ఎయిర్‌బస్ నారో బాడీ విమానాలను ప్రవేశపెట్టడానికి ఎయిర్‌లైన్ లీజులు, లెటర్ ఆఫ్ ఇండెంట్‌లపై సంతకం చేసింది.
దేశంలోని విమాన ప్రయాణికులకు రానున్న రోజుల్లో ప్రయాణం మరింత సౌలభ్యంగా మారనుంది. ఎందుకంటే రానున్న15 నెలల్లో ఎయిర్ ఇండియా 30 విమానాలను అదనంగా ప్రవేశపెట్టనుంది. దీంతో విమాన టిక్కెట్ల బుకింగ్‌లో రద్దీ కొంతమేరకు తగ్గనుంది. సోమవారం ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి 30 కొత్త విమానాలను క్రమంగా ప్రవేశపెడతామని పేర్కొంది. వాటిలో ఐదు వైడ్ బాడీ బోయింగ్ విమానాలు ఉంటాయని వివరించింది.
టాటాస్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ తన దేశీయ, అంతర్జాతీయ సేవలను పెంచడానికి చూస్తుండటంతో ఎయిర్ ఇండియా ఈ మేరకు ఈ ప్రకటన చేసింది. రాబోయే 15 నెలల్లో 5 వైడ్-బాడీ బోయింగ్, 25 ఎయిర్‌బస్ నారో బాడీ విమానాలను ప్రవేశపెట్టడానికి ఎయిర్‌లైన్ లీజులు, లెటర్ ఆఫ్ ఇండెంట్‌లపై సంతకం చేసింది. ఇదిలా ఉండగా.. 2040 నాటికి భారతదేశంలోని విమానయాన సంస్థలకు 2,210 విమానాలు అవసరమవుతాయని ఎయిర్‌బస్ ఇటీవల అంచనా వేయడం గమనార్హం.