ప్రపంచంలో అతి భారీ విమాన కొనుగోలు ఆర్డర్ ఎయిర్ ఇండియాదే..
ఎయిర్ ఇండియా కొత్తగా కొనుగోలు చేయబోతున్న విమానాల్లో 400 నారో బాడీ, 100 వైడ్ బాడీ రకాలున్నాయి. ఎయిర్ బస్, బోయింగ్ తో త్వరలోనే ఒప్పందం ఖరారు కాబోతోంది.
ఒకటి కాదు రెండు కాదు 500 విమానాలు.. కోటి రెండు కోట్లు కాదు 8.2 ల క్షల కోట్ల రూపాయలు.. ఇదీ క్లుప్తంగా ఎయిర్ ఇండియా కుదుర్చుకున్న డీల్. ప్రపంచంలోనే అతి పెద్ద విమాన కొనుగోలు ఆర్డర్ గా ఇది మిగిలిపోనుంది. టాటా గ్రూప్ సొంతమైన ఎయిర్ ఇండియా వ్యాపార విస్తరణ కోసం 500 వరకు కొత్త విమానాల కొనుగోలుకు త్వరలో ఆర్డర్ ఇవ్వబోతోంది.
ఎయిర్ ఇండియా కొత్తగా కొనుగోలు చేయబోతున్న విమానాల్లో 400 నారో బాడీ, 100 వైడ్ బాడీ రకాలున్నాయి. ఎయిర్ బస్, బోయింగ్ తో త్వరలోనే ఒప్పందం ఖరారు కాబోతోంది. ఎయిర్ బస్ ఏ350, బోయింగ్ 787, 777 రకం విమానాలను ఎయిర్ ఇండియా కొనుగోలు చేయబోతోంది. ఈ మొత్తం విమానాల ఆర్డర్ విలువ 10,000 కోట్ల డాలర్లు.. మన కరెన్సీలో రూ.8.2 లక్షల కోట్లపైమాటే. ఈ డీల్ కుదిరితే ప్రపంచంలో ఇదే అతిపెద్ద విమానాల కొనుగోలు ఆర్డర్ అవుతుంది. గతంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ 460 విమానాలను ఎయిర్ బస్, బోయింగ్ నుంచి కొనుగోలు చేసింది. ఇప్పుడీ రికార్డ్ ఎయిర్ ఇండియా సొంతం కాబోతోంది.
ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్ లైన్స్ విలీనం కావాల్సి ఉంది. ఈ విలీనం పూర్తయ్యాక ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ కు 25 శాతానికి పైగా వాటా లభిస్తుంది. 2024 మార్చి నాటికి ఈ విలీన ప్రక్రియ పూర్తవుతుంది. విస్తారాలో టాటా గ్రూప్ కి 51 శాతం వాటా ఉండగా, 49 శాతం వాటా సింగపూర్ ఎయిర్ లైన్స్ కి ఉంది. విస్తారాను విలీనం చేశాక దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఎయిర్ ఇండియా అగ్రగామి సంస్థగా ఎదిగే అవకాశాలున్నాయి. దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సేవల సంస్థగా, రెండో అతిపెద్ద డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ గా ఎయిర్ ఇండియా అవతరిస్తుంది.