జరిమానా రూ.250 అయితేనే కడతా.. లేదంటే జైలుకే వెళతా..
ఈ ఘటనపై విచారణ చేపట్టిన అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ మొత్తాన్ని చెల్లించేందుకు అతను నిరాకరించాడు.
విమానంలో సిగరెట్ తాగడమే కాకుండా.. తన దురుసు ప్రవర్తనతో తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన ఘటనలో నిందితుడు కోర్టు బెయిల్ నిమిత్తం విధించిన పూచీకత్తును చెల్లించనని, తాను జైలుకే వెళ్తానని వింత వాదన చేశాడు. న్యాయస్థానం రూ.25 వేలు పూచీకత్తు చెల్లించాలని చెప్పగా, తాను ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేశానని, ఆ సెక్షన్ కింద రూ.250 మాత్రమే జరిమానా ఉందని వాదించాడు.
భారత సంతతికి చెందిన రత్నాకర్ ద్వివేది (37) ఇటీవల లండన్ నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. ప్రయాణంలో ఉండగా.. బాత్‌రూమ్‌లోకి వెళ్లిన అతను అక్కడే సిగరెట్ తాగుతుండగా, సిబ్బంది అప్రమత్తమై అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అరవడం మొదలుపెట్టిన అతను.. విమానం తలుపు తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో షాక్‌కు గురైన సిబ్బంది వెంటనే అతన్ని పట్టుకుని కాళ్లూ చేతులూ కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ మొత్తాన్ని చెల్లించేందుకు అతను నిరాకరించాడు. తాను ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేశానని, ఆ సెక్షన్ కింద రూ.250 మాత్రమే జరిమానా ఉందని, అంతే చెల్లిస్తానని వాదించాడు. లేదంటే జైలుకే వెళతానని వింత వాదన చేశాడు. దీంతో అతనిని జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది.