ముంబయిలో ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
ఈ కేసులో 40 ఏళ్ల వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
మహారాష్ట్రలోని ముంబయిలో ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనలో అక్కడ స్వీపర్‌గా పనిచేసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్ ఓగ్రే ఎయిర్ ఇండియాలో ఉద్యోగానికి ఎంపిక కావడంతో ఈ ఏప్రిల్‌లోనే ముంబయికి వచ్చారు. సబర్బన్ అంధేరీలోని మరోల్ ప్రాంతంలోని క్రిషన్‌లాల్ మార్వా మార్గ్‌లోని ఎన్‌జీ కాంప్లెక్స్‌లోని ఫ్లాట్‌లో తన సోదరి, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్నారు. వారం రోజుల కిందట వారిద్దరూ స్వగ్రామానికి వెళ్లారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వీడియో కాల్ మాట్లాడిన ఆమె తరువాత అసలు ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వారు ముంబైలోని ఆమె స్నేహితులకు ఫోన్ చేసి ఫ్లాట్‌కు వెళ్లమని కోరారు. వారు అక్కడికి వచ్చి చూడగా లోపలి నుంచి తాళం వేసి ఉంది. కాలింగ్ బెల్ కొట్టినా స్పందన లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. రూపాల్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి హుటాహుటిన సమీపంలోని రాజావాడి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
అయితే, ఈ కేసులో 40 ఏళ్ల వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రధాన నిందితుడిగా భావించి అరెస్టయిన విక్రమ్ అత్వాల్ అనే వ్యక్తి అదే హౌసింగ్ సొసైటీలో స్వీపర్‌గా పనిచేస్తుంటాడని.. అయితే, కొద్ది రోజుల క్రితం రూపాల్‌కు, అతడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ కేసులో ఆధారాల కోసం హౌసింగ్ సొసైటీలోని కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, విక్రమ్ అత్వాల్ భార్యను కూడా విచారిస్తున్నారు.