Telugu Global
National

మళ్లీ కంటైన్‌మెంట్ జోన్స్‌, సోషల్‌ డిస్టెన్స్‌.. కేరళలో నిపా డేంజర్ బెల్స్

మరోవైపు కేరళ ప్రభుత్వం నియంత్రణ చర్యలను వేగవంతం చేసింది. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. కోజికోడ్‌ జిల్లాల్లోని 9 గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించింది.

మళ్లీ కంటైన్‌మెంట్ జోన్స్‌, సోషల్‌ డిస్టెన్స్‌.. కేరళలో నిపా డేంజర్ బెల్స్
X

కేరళలో మళ్లీ ప్రమాదకర నిపా వైరస్ డేంజర్‌ బెల్స్ మోగిస్తోంది. తాజాగా నిపా వైరస్‌ సోకిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. తాజాగా ఓ హెల్త్‌ వర్కర్ సైతం నిపా బారిన పడినట్లు గుర్తించారు. అయితే ఎవరి నుంచి ఇది వ్యాపించిందనేది ఇప్పటివరకూ అంతుబట్టలేదు. ఇక అంతకుముందు నిపా బాధితుల సంఖ్య నాలుగుగా ఉండగా.. అందులో ఇద్దరు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వైరస్‌ బారిన పడిన ఐదో వ్యక్తి కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పని చేస్తారని తెలుస్తోంది. ఇదే హాస్పిటల్‌లో ఆగస్టు 30న నిపా సోకిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం హెల్త్‌ వర్కర్‌తో పాటు మరో ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది. 153 మంది హెల్త్‌ వర్కర్స్‌ను కాంటాక్ట్‌ లిస్ట్‌లో చేర్చారు.

మరోవైపు కేరళ ప్రభుత్వం నియంత్రణ చర్యలను వేగవంతం చేసింది. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. కోజికోడ్‌ జిల్లాల్లోని 9 గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివ్ గా గుర్తించిన వారి కాంటాక్ట్‌లిస్ట్‌లో 800 మందిని చేర్చింది. బుధవారం కేరళ సీఎం పినరయి విజయన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కోజికోడ్‌ జిల్లాలో పది రోజుల పాటు సోషల్‌ డిస్టెన్స్ అమలు చేయాలని నిర్ణయించారు. ఎలాంటి ఫంక్షన్లు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా.. పోలీసుల అనుమతి తప్పనిసరని చేశారు.

కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న 800 మందిలో 77 మంది హై రిస్క్‌లో ఉన్నారని.. మరో 17 మందిని కోజికోడ్ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం వైరస్‌ సోకిన ముగ్గురిలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అతను లైఫ్‌ సపోర్టుపై ఉన్నాడని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. అతడి చికిత్సకు అవసరమైన మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ని పంపించాలని ఐసీఎంఆర్‌ను కోరినట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం అలర్ట్ అయింది. నేషనల్ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ నుంచి డాక్టర్ల బృందం కేరళను సందర్శించింది. ఐసీఎంఆర్ పూణే నుంచి ఓ బృందం, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి మరో బృందం కోజికోడ్‌కు చేరుకోనున్నాయి.

First Published:  14 Sept 2023 2:24 AM GMT
Next Story