Telugu Global
National

హత్యకేసు నిందితులకు మద్దతుగా మహా పంచాయత్.... మళ్ళీ విద్వేష దాడులు

రాజస్తాన్ కు చెందిన జునైద్, నసీర్ లు ఆవులను రవాణా చేస్తున్నారనే అనుమానంతో తమను తాము గోరక్షులుగా ప్రకటించుకున్న ఓ గుంపు వారిద్దరిపై దాడి చేసి హత్య చేసి వారిని కారులో ఉంచి కారును హర్యానాలో తగలబెట్టేశారు. దానిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చిన నేపథ్యంలో హిందూ సంఘాల నాయకత్వంలో పలు చోట్ల హిందూ పంచాయత్ లు జరిగాయి. జునైద్, నసీర్ లను హత్యచేసిన వారిని అరెస్టు చేస్తే అంతు చూస్తామని పోలీసులను ఆ పంచాయత్ లు హెచ్చరించాయి.

హత్యకేసు నిందితులకు మద్దతుగా మహా పంచాయత్.... మళ్ళీ విద్వేష దాడులు
X

హర్యానాలో, రాజస్థాన్ వాసులు జునైద్, నసీర్‌లను హత్య చేసిన నిందితులకు అనుకూలంగా పాల్వాల్, గురుగ్రామ్‌లో బజరంగ్ దళ్ అద్వర్యంలో ముస్లిం వ్యతిరేక మహాపంచాయత్ లు జరిగాయి. ఈ పంచాయత్ ల తర్వాత మళ్ళీ ముగ్గురు వ్యక్తుల మీద దాడులు జరిగాయి.

రాజస్తాన్ కు చెందిన జునైద్, నసీర్ లు ఆవులను రవాణా చేస్తున్నారనే అనుమానంతో తమను తాము గోరక్షులుగా ప్రకటించుకున్న ఓ గుంపు వారిద్దరిపై దాడి చేసి హత్య చేసి వారిని కారులో ఉంచి కారును హర్యానాలో తగలబెట్టేశారు. దానిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చిన నేపథ్యంలో హిందూ సంఘాల నాయకత్వంలో పలు చోట్ల హిందూ పంచాయత్ లు జరిగాయి. జునైద్, నసీర్ లను హత్యచేసిన వారిని అరెస్టు చేస్తే అంతు చూస్తామని పోలీసులను ఆ పంచాయత్ లు హెచ్చరించాయి.

ఆ పంచాయత్ ల తర్వాత మళ్ళీ ముగ్గురు వ్యక్తుల మీద దాడులు జరిగాయి.మొదటి సంఘటనలో, ఫిబ్రవరి 22 సాయంత్రం మడోఖ్రా గ్రామానికి చెందిన నాదిర్ పై ఓ ఆటో డ్రైవర్ నేతృత్వంలోని బృందం పల్వాల్ హథిన్ క్రాసింగ్ వద్ద దాడి చేసింది. నాదిర్ ముస్లిం అని తెలిసిన తర్వాతనే వారు దాడి చేశారని అతని కుటుంబం ఆరోపించింది. నాదిర్‌పై దాడి చేసిన తర్వాత అతన్ని పొదల్లో వదిలేసి పారిపోయారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో కొంతకాలం చికిత్స పొందిన ఆయన ఇప్పుడు స్వగ్రామంలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు..

నదీర్ బంధువు నసీమ్ అహ్మద్ మాట్లాడుతూ, “అతను తన పని స్థలం నుండి తిరిగి ఆటోలో వస్తున్నప్పుడు దారిలో, ఆటో డ్రైవర్ వాహనంలో ఇంధనం అయిపోయిందని చెప్పి, నాదిర్‌ను దిగమని అడిగాడు. అతడిని ముస్లింగా గుర్తించి, దాడి చేసి అక్కడే వదిలేశారు.'' అని చెప్పాడు. నాదిర్ తండ్రి అక్తర్ జమాల్ మాట్లాడుతూ, “అతనిపై దాడి చేసి చనిపోయాడనుకొని అక్కడే వదిలేశారు. అతను ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.'' అని తెలిపాడు.

రెండో ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన సలీం, ముజాహిద్ అనే ఇద్దరు వ్యక్తులు పశువులను కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా వారిని ఆపి ముగ్గురు వ్యక్తులు కొట్టారు. మన్పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది, ఫిబ్రవరి 23 ఉదయం, గోరక్షక బృందం ఈ ఇద్దరిపై దాడి చేసింది. సలీమ్‌పై గొడ్డలితో దాడి చేసి గాయపరిచారు. ముజాహిద్ తప్పించుకోగలిగాడు.

ఘటన అనంతరం సలీంను హాథిన్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ''మేం ముస్లింలమని తెలిసి మాపై దాడికి పాల్పడ్డారు'' అని సలీమ్ అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు సలీం చేతి గడియారంతో పాటు పశువులను కొనుగోలు చేసేందుకు వారి వద్ద ఉన్న సుమారు రూ.50,000 దోచుకెళ్లారు. ఈ ఘటనలో సలీం ద్విచక్రవాహనం ధ్వంసమైంది.

ఈ ఘటనపై ముత్కటి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదైంది. అయితే, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇది ద్వేషపూరిత నేరం కాదని చిన్న సంఘటన అని కొట్టిపారేశారు. డబ్బు, చేతి గడియారం చోరీకి గురయ్యాయి అంతే అని అన్నారాయన. ఎఫ్‌ఐఆర్ కాపీలో కూడా డబ్బు, చేతి గడియారం లూటీ గురించే ప్రస్తావించబడింది.

ఆ ప్రాంతం గో సంరక్షక సమూహాల నియంత్రణలో ఉందని కొంతమంది స్థానిక సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు అంటున్నారు. జునైద్, నసీర్‌లను చంపినట్లు అనుమానిస్తున్న మోను మనేసర్, బజరంగ్ దళ్ కార్యకర్తలకు మద్దతుగా జరిగిన ద్వేషంతో నిండిన మహాపంచాయత్‌ల కారణంగా ఈ ద్వేషపూరిత దాడులు జరిగాయని వారు భావిస్తున్నారు. స్థానికులు ఈ రెండు సంఘటనలకు ఆ ప్రాంతంలోని మహాపంచాయత్‌లు సృష్టించిన ఆవేశపూరిత వాతావరణమే కారణమని భావిస్తున్నారు.

స్థానిక నివాసి ముబారక్ మాట్లాడుతూ, “ఈ సంఘటనలు పంచాయతీలు సృష్టించిన విద్వేష‌ వాతావరణానికి ప్రతిస్పందన. పంచాయితీకి ఇతర జిల్లాల నుండి కూడా ప్రజలు హాజరయ్యారు. మోను మానేసర్‌పై చర్య తీసుకోవద్దని ముస్లింలను, పోలీసులను కూడా వారు హెచ్చరించారు.'' అని చెప్పారు.

మోను మనేసర్, బజరంగ్ దళ్ నాయకుడు. హర్యానా ప్రభుత్వ "గో రక్షణ కార్యదళం" సభ్యుడు. హత్యలలో అతని ప్రమేయం ఉందని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. అయితే రాజస్థాన్ పోలీసులు ఇంకా "పరిశోధన" చేస్తున్నామ‌ని చెప్పారు.

“విచారణ ఇంకా పూర్తి కాలేదు. [కనీసం ఒక] డజను మంది వ్యక్తుల పాత్ర ఇంకా దర్యాప్తు చేయబడుతోంది, ”అని భరత్‌పూర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ శ్రీవాస్తవ చెప్పారు. మోను మనేసర్, లోకేష్ సింగ్లా పాత్ర గురించి ఒక నిర్దిష్ట అంచనాకు వచ్చే వరకు పోలీసులు ఎవరి పేరు చెప్పరు అని ఆయన అన్నారు. మోను మనేసర్ నిర్దోషా లేదా నిందితుడా అనేది నేను ఇప్పుడే చెప్పలేను అన్నాడు ఆ అధికారి.

కాగా మనేసర్ పట్టణంలో, ఫిబ్రవరి 21న బజరంగ్ దళ్ నిర్వహించిన మొదటి మహాపంచాయత్ లో జునైద్, నాసిర్‌లను చంపిన నిందితులను అరెస్టు చేస్తే, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని రాజస్థాన్ ప్రభుత్వం, పోలీసులను హెచ్చరించారు. ఫిబ్రవరి 22న హాథిన్‌లో జరిగిన రెండవ పంచాయత్ లో, మోనుపై చర్య తీసుకోవడానికి ప్రయత్నిస్తే ముస్లింలు, పోలీసులపై దాదులకు దిగాలని బహిరంగ పిలుపు ఇచ్చారు.

మరో వైపు హత్యకు గురైన జునైద్, నాసిర్ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హర్యానాలోని నుహ్ జిల్లాలోని ఫిరోజ్‌పూర్ జిర్కాలో వేలాది మంది ముస్లింలు, సామాజిక కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు..

బజరంగ్ దళ్ నాయకుడు, హర్యానా స్పెషల్ కౌ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు మనేసర్‌తో సహా జునైద్, నాసిర్‌ల హత్యలో పాల్గొన్న వారిని వెంటనే అరెస్టు చేయాలని నిరసన కారులు డిమాండ్ చేశారు.

మరోవైపు ఆందోళనకారులు గురుగ్రామ్‌-అల్వార్‌ హైవేను కొద్దిసేపు దిగ్బంధించారు. తరువాత, వారు స్థానిక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) ద్వారా భారత రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించారు.

ఆందోళనకారులు SDMకిచ్చిన మెమోరాండంలో....

"హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక గోసంరక్షణ టాస్క్‌ఫోర్స్ లో గోసంరక్షణ పేరుతో పాడి రైతులను బెదిరించే, ప్రజలను చంపడానికి కూడా వెనుకాడని కొంతమంది గూండాలను చేర్చారు."

“ఇప్పటి వరకు, పెహ్లూ ఖాన్, ఉమర్ ఖాన్, రక్బర్ ఖాన్, వారిస్ ఖాన్ వంటి వ్యక్తులను హత్య చేశారు. ఇప్పుడు జునైద్, నాసిర్ కూడా గో సంరక్షణ పేరుతో ఆ సంఘ వ్యతిరేకులే చంపారు. నాసిర్, జునైద్‌లను భరత్‌పూర్ నుండి కిడ్నాప్ చేసి, భివానీ జిల్లాలో బొలెరో వాహనంలో సజీవ దహనం చేశారు, ”అని మెమోరాండంలో పేర్కొన్నారు.

హంతకులను వెంటనే అరెస్టు చేయాలని, మేవాత్ ప్రాంతంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని హత్యలపై న్యాయ విచారణ జరిపించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. నిందితులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేయాలని, ఆర్థిక సహాయంతో పాటు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.

నసీర్, జునైద్‌ల కిడ్నాప్‌కు ఉపయోగించిన వాహనం హర్యానా పంచాయితీ శాఖకు చెందినదని మెమోరాండం పేర్కొంది.

“షేక్‌పూర్, రావా, బఘోలా, రావాలి గ్రామాలలో జరిగిన వివిధ సంఘటనలలో ఇదే వాహనం ఉపయోగించారు. ఈ విషయంలో న్యాయమైన విచారణ జరిపి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలి’’ అని మెమోరాండంలో కోరారు.ఈ కేసుల్లో స్థానిక పోలీసుల పాత్రపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

First Published:  25 Feb 2023 5:16 PM IST
Next Story