వీఐపీలకు ఒక న్యాయం సాధారణ పౌరులకు మరో న్యాయమా? - CJI కి న్యాయవాద సంఘం లేఖ!
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ వై చంద్రచూడ్‌కు న్యాయవాదుల సంఘం ఓ లేఖ రాసింది. ఆ లేఖలో, సంఘం అధ్యక్షుడు వివేక్ సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి టిజి రవి లు, న్యాయం అందరికీ సమానంగా ఉండాలని కోరారు.
8 కోట్ల రూపాయలతో అడ్డంగా దొరికిన కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కు కొన్ని గంటల్లోనే ముందస్తు బెయిల్ రావడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై న్యాయవాద సంఘాలు కూడా అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నాయి. వీఐపీలకు ఒక న్యాయం, సాధారణ పౌరులకు మరో న్యాయమా అంటూ బెంగుళూరు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ మేరకు సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ వై చంద్రచూడ్‌కు న్యాయవాదుల సంఘం ఓ లేఖ రాసింది. ఆ లేఖలో, సంఘం అధ్యక్షుడు వివేక్ సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి టిజి రవి లు, న్యాయం అందరికీ సమానంగా ఉండాలని కోరారు.
"కర్ణాటక హైకోర్టులో సాధారణంగా జరిగేది ఏంటంటే, ముందస్తు బెయిల్ వంటి కొత్త పిటిషన్లు పోస్ట్ చేయడానికి చాలా రోజులు, ఒక్కో సారి అనేక వారాలు పడుతుంది. అయితే VIP ల విషయానికొచ్చే సరికి రాత్రికి రాత్రే పిటిషన్లు పోస్ట్ అవడం, బెయిల్ రావడం కూడా జరిగిపోతుంది.'' అని అసోసియేషన్ లేఖలో పేర్కొంది.
ఈ పద్ధతి వల్ల సామాన్యులకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని, ఎమ్మెల్యేను కూడా సామాన్యుడిలా చూడాలని సంఘం సూచించింది.
మరో వైపు, కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా అసోసియేషన్ లేఖ రాసింది. అందులో, ''అన్ని ముందస్తు బెయిల్ పిటిషన్లను ఒకే రోజు పోస్ట్ చేసేలా రిజిస్ట్రీని ఆదేశించాలి. దాని వల్ల సామాన్యుడిని కూడా విఐపిగా పరిగణించవచ్చు" అని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్ష కుమారుడు ప్రశాంత్ గత గురువారం రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత తండ్రీ, కుమారుల ఇళ్ళల్లో జరిపిన సోదాల్లో 8 కోట్ల రూపాయల కరెన్సీ దొరికింది. ఈ కేసులో ఏ1 గా ఎమ్మెల్యే విరూపాక్షప్ప, ఏ2గా ఆయన కుమారుడు ప్రశాంత్ లు ఉన్నారు. ప్రశాంత్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా, విరూపాక్షప్ప మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి తాను అరెస్టు కాకుండా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు.