శివసేనకు ఆదిత్య ఠాక్రే రిపేర్లు..!
అతి త్వరలో తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదిత్య ఠాక్రే మహారాష్ట్రలోని ప్రధాన పట్టణాలైన భివండి, నాసిక్, దిండోరి, షిర్డీ, శంభాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
రెండున్నర సంవత్సరాల కిందట మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవిని అధిష్టించగా, ఇటీవల ఆ పార్టీలో చెలరేగిన సంక్షోభం కారణంగా పార్టీలో కీలక నేత అయిన ఏక్ నాథ్ షిండే శివసేనను నిలువునా చీల్చి బీజేపీ మద్దతుతో ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
మహారాష్ట్రలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 42 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలో చేరారు. షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే శివసేన పునాదులు కదలడం ప్రారంభమైంది. ఆ పార్టీకి చెందిన వివిధ నగరపాలక సంస్థల కార్పొరేటర్లు, మేయర్లు, జిల్లాల అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు షిండే వర్గంలో చేరడం మొదలుపెట్టారు.
రోజురోజుకూ షిండే వర్గం బలోపేతమవుతూ ఉండడంతో షిండే కూడా అసలైన శివసేన మాదే అంటూ తరచూ ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివసేన పార్టీని ఎలా కాపాడుకోవాలి.. అనే విషయమై ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో అంతర్మథనం మొదలైంది. ఇదిలా ఉండగా పార్టీని మళ్లీ నిలబెట్టేందుకు ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే నడుం బిగించారు. పార్టీ నుంచి షిండే వర్గంలోకి వలసలను ఆపడానికి ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది.
అతి త్వరలో తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదిత్య ఠాక్రే మహారాష్ట్రలోని ప్రధాన పట్టణాలైన భివండి, నాసిక్, దిండోరి, షిర్డీ, శంభాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మన కాషాయ జెండా- మనదే శివసేన అనే నినాదంతో వివిధ పట్టణాల్లో పర్యటిస్తూ పార్టీకి షిండే వర్గం తలపెట్టిన ద్రోహం గురించి ప్రజలకు వివరించనున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలు పార్టీని వీడి వెళ్లకుండా వారితో సమావేశం కానున్నారు.
పార్టీ భవిష్యత్తుపై కిందిస్థాయి కార్యకర్తల్లో ఆందోళన ఉండగా, పార్టీ మన చేతుల్లోనే ఉందనే భరోసాను వారిలో కల్పించనున్నారు. ఆదిత్య ఠాక్రే మూడు రోజుల పర్యటన ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆయన మరిన్ని ప్రాంతాల్లో వరుసగా పర్యటించనున్నారని తెలుస్తోంది. చిన్నా భిన్నమైన శివసేన పార్టీని ఆదిత్య ఠాక్రే మళ్లీ బలోపేతం చేస్తాడేమో వేచి చూడాలి.