Telugu Global
National

ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అన్న కాంగ్రెస్ ఎంపీ.. పార్లమెంటులో దుమారం.. కావాలని అనలేదన్న ఎంపీ

తప్పును గుర్తించి ఆ మాటను తర్వాత అనలేదు. నాతో విజయ్ చౌక్ వద్ద మాట్లాడిన జర్నలిస్టులను కూడా ఈ విషయాన్ని హైలైట్ చేయవద్దని కూడా చెప్పానని అధిర్ వివరించారు.

ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అన్న కాంగ్రెస్ ఎంపీ.. పార్లమెంటులో దుమారం.. కావాలని అనలేదన్న ఎంపీ
X

కాంగ్రెస్ ఎంపీ అధిర్ రాజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు గురువారం పార్లమెంటు ఉభయ సభలను స్తంభింప చేశాయి. బుధవారం విజయ్ చౌక్‌లో అధిర్ మీడియాతో మాట్లాడుతూ.. ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని'గా సంబోధించారు. రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ సభ్యులు గురువారం ఉభయ సభల్లో నిరసనకు దిగారు. రాజ‌న్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలకు ఆయనే కాకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో డిమాండ్ చేశారు.

దేశ అత్యున్నత పదవిలో ఉన్న మహిళకు జరిగిన అవమానాన్ని సోనియా గాంధీ కూడా ఆమోదించారని, ఆమె బలహీన వర్గాలకు వ్యతిరేకమంటూ స్మృతీ ఇరానీ మండిపడ్డారు. ఈ విషయంపై ఉభయ సభల్లో దుమారం చెలరేగడంతో.. మరోసారి వాయిదా పడ్డాయి. ఇక పార్లమెంటు వెలుపల బీజేపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా నిరసనలో పాల్గొన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలే అని.. సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.

కాగా, ఈ వివాదంపై అధిర్ రాజన్ చౌదరి స్పందించారు. రాష్ట్రపతిని అవమానించే ఉద్దేశం లేదని, అది పొరపాటున జరిగిందని స్పష్టం చేశారు. చేసిన పొరపాటుకు నన్ను ఉరి తీయండి. కానీ మేడమ్ సోనియా గాంధీని ఎందుకు లాగుతున్నారని ఆయన ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడే సమయంలో 'రాష్ట్రపత్ని' అని నోరు జారాను. తప్పును గుర్తించి ఆ మాటను తర్వాత అనలేదు. నాతో విజయ్ చౌక్ వద్ద మాట్లాడిన జర్నలిస్టులను కూడా ఈ విషయాన్ని హైలైట్ చేయవద్దని కూడా చెప్పానని అధిర్ వివరించారు.

ఈ విషయాన్ని కొంత మంది బీజేపీ నాయకులు కావాలని రచ్చ చేస్తున్నారని అధిర్ మండిపడ్డారు. గోటితో పోయే దాన్ని కొండంత చేస్తున్నారని.. జీఎస్టీ, ఇతర సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగకుండా చేయడానికి ఇలాంటి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అధిర్ ఆరోపించారు. దేశ రాష్ట్రపతిగా బ్రాహ్మిణ్ ఉన్నా, గిరిజనులు ఉన్నా.. అందరం గౌరవిస్తామని.. పొరపాటున అన్న మాటకు ఇలా పెడార్థాలు తీయడం భావ్యం కాదన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియో విడుదల చేశారు.

స్మృతిపై సోనియా ఆగ్రహం..

రాష్ట్రపతిని అవమానించారనే విషయంపై ఉభయ సభల్లో దుమారం చెలరేగడంతో వాయిదా వేశారు. లోక్‌సభ వాయిదా పడిన తర్వాత కూడా సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీ రమాదేవి వద్దకు సోనియా గాంధీ వెళ్లి మాట్లాడుతున్నారు. ఇంతలో స్మృతి ఇరానీ వచ్చి మాటల మధ్యలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నాతో మాట్లాడొద్దు అంటూ స్మృతిపై మండిపడ్డారు. సోనియా కోపాన్ని చూసి తాను కూడా భయపడ్డానని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

First Published:  28 July 2022 5:06 PM IST
Next Story