ఆధార్ కార్డ్ దుర్వినియోగంపై ఈమెయిల్ అలర్ట్..
వర్చువల్ ఐడీని ఏరోజుకారోజు మార్చుకునే అవకాశం ఉంది. అంటే వర్చువల్ ఐడీ ఉన్నంత మాత్రాన ఎవరూ మన ఆధార్ వివరాలు తెలుసుకోలేరు. ఒకేసారి, ఒకే అవసరానికి, ఒకరోజు మాత్రమే ఈ వర్చువల్ ఐడీ ఉపయోగపడుతుంది.
ఆధార్ కార్డ్ ని ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ధృవీకరణకోసం వినియోగించారో ఇకపై ఈమెయిల్ ద్వారా తెలుసుకోవచ్చని చెబుతోంది కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ. గడచిన ఆరునెలల ఆధార్ వినియోగాన్ని యూఐడీఏఐ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చని, లేదా ఎం-ఆధార్ అనే యాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చని తెలిపింది. ఆధార్ ధృవీకరణ జరిపిన ప్రతిసారీ ఆ విషయాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈమెయిల్ ద్వారా సదరు వ్యక్తికి సమాచారం ఇస్తుందని తెలిపింది. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఈమెయిల్ ను ఆధార్ కు అనుసంధానం చేసుకోవాలని తెలిపింది. ఓటీపీ ద్వారా ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మొబైల్ నెంబర్ ను ఆధార్ నెంబర్ తో జతచేసుకోవాలని సూచించింది.
వర్చువల్ ఐడీ..
ఆధార్ నెంబర్ కావాలని అడిగే సంస్థలు.. దాన్ని ఎందుకోసం అడుగుతున్నారో స్పష్టంగా తెలుసుకోవాలని పేర్కొంది కేంద్రం. తమ ఆధార్ నెంబర్ ని షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకొని వాడుకోవచ్చని పేర్కొంది. యూఐడీఏఐ వెబ్ సైట్, మై ఆధార్ పోర్టల్ ద్వారా వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకొని ఆధార్ ధృవీకరణ కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. వర్చువల్ ఐడీని ఏరోజుకారోజు మార్చుకునే అవకాశం ఉంది. అంటే వర్చువల్ ఐడీ ఉన్నంత మాత్రాన ఎవరూ మన ఆధార్ వివరాలు తెలుసుకోలేరు. ఒకేసారి, ఒకే అవసరానికి, ఒకరోజు మాత్రమే ఈ వర్చువల్ ఐడీ ఉపయోగపడుతుంది.
ఆధార్ కాపీలు జాగ్రత్త..
ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు ఎక్కడపడితే అక్కడ పడేసుకోవద్దని సూచించింది కేంద్రం. ఆధార్ కార్డ్ ని సోషల్ మీడియాలో అస్సలు పోస్ట్ చేయొద్దని తెలిపింది. ఎవరికైనా వాట్సప్ లో పంపించినా, ఆ తర్వాత ఆ మెసేజ్ ని డిలీట్ చేసుకోవాలని సూచించింది. ఆధార్ ని ఎక్కడైనా, ఎప్పుడైనా ధైర్యంగా వినియోగించుకోవచ్చని, అయితే దాని వినియోగాన్ని ఓ కంట కనిపెడుతుండాలని సూచించింది. ఆధార్ డౌన్ లోడ్ కోసం వచ్చే ఓటీపీని, ఎం-ఆధార్ పిన్ నెంబర్ ని ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించింది. ఆధార్ సమస్యలు ఉంటే 1947 టోల్‌ఫ్రీ నెంబర్ కు ఏ సమయంలో అయినా కాల్ చేయొచ్చని సూచించింది.