అదానీ చేతికి ఎన్డీటీవీ ... 29 శాతం వాటా కొనుగోలు,మరో 26 శాతానికి ఆఫర్
NDTV లో మెజారిటీ వాటాను చేజిక్కించుకోనున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. ఇప్పటికే 29.18 శాతం వాటాను పరోక్షంగా దక్కించుకున్న అదానీ గ్రూపు మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
మీడియా రంగంలోకి అదానీ గ్రూపు ప్రవేశించింది. ఎన్డీటీవీ లో 29.18 శాతం వాటాను పరోక్షంగా దక్కించుకుంది. వ్యాపార దిగ్గజం అదానీ గ్రూపు ఆధ్వర్యంలోని ఏఏంజీ మీడియా నెట్ వర్క్స్ ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న విశ్వ ప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇంత శాతం వాటాను పరోక్షంగా కొనుగోలు చేశారు. ఇది అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ యాజమాన్య ఆధ్వర్యంలో ఉంది. ఈ వాటాయే కాకుండా ఓపెన్ ఆఫర్ ద్వారా మరో 26 శాతం వాటాను కొనుగోలు చేయాలన్నది కూడా ఈ సంస్థ లక్ష్యం. ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ అండ్ అదానీ ఎంటర్ ప్రైజెస్ తో బాటు విశ్వ ప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు షేరుకు 294 రూపాయల చొప్పున 1,67,62,530 ఫుల్లీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ల కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ చేయడం విశేషం. సెబీ లోని 8 (2) రెగ్యులేషన్ రూల్ ప్రకారం మా ఆఫర్ ధర ఎక్కువేనని ఈ సంస్థలు ప్రకటించాయి. అంటే ఒక్కో షేర్ కి 294 రూపాయలను అదానీ సంస్థ ఆఫర్ చేసింది. ఓపెన్ ఆఫర్లలో షేర్ల కొనుగోలుకు 492. 8 కోట్లు చెల్లించబోతోంది విశ్వప్రధాన్ సంస్థ. దీంతో ఆర్ఆర్ఫీ ఆర్ లో 99.5 శాతం వాటాను దక్కించుకోనుంది.
లీడింగ్ మీడియా సంస్థల్లో ఎన్డీటీవీ ఒకటని, మూడు దశాబ్దాలకు పైగా విశ్వసనీయమైన న్యూస్ ఇస్తూ ఎంతో పాపులర్ అయిందని ఈ ప్రకటన పేర్కొంది. ఈ సంస్థ మూడు జాతీయ వార్తా చానళ్లను నిర్వహిస్తోంది. ఎన్డీటీవీ 24x 7, ఎన్డీటీవీ ఇండియా, ఎన్డీటీవీ ప్రాఫిట్ అనే సంస్ధలను నిర్వహిస్తున్న ఈ కంపెనీ.. ఆన్ లైన్ వార్తలను ఇవ్వడమే కాదు.. సోషల్ మీడియాలో అత్యంత పాపులర్ అయిన సంస్థల్లో ఒకటి.. దీనికి వివిధ వేదికల్లో 35 మిలియన్ మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు కూడా..
వివిధ ప్లాట్ ఫామ్ లపై సరికొత్త మీడియా ప్రయాణానికి ఏఎంఎన్ఎల్ పూనుకొన్న తరుణంలో ఇదొక గణనీయమైన మైలురాయని ఏఎంజీ మీడియా సీఈఓ సంజయ్ పుగాలియా అభివర్ణించారు. భారత ప్రజలు , కన్స్యూమర్లు, సమాచారాన్ని తెలుసుకోగోరే వ్యక్తులను దృష్టిలో నుంచుకొని వారికి సాధికారతను కల్పించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఎన్డీటీవీ అన్నది అమూల్యమైన ప్రసార డిజిటల్ ప్లాట్ ఫామ్ అని, ఒక విజన్ తో ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. న్యూస్ ను అందించడంలో ఎన్డీటీవీ లీడర్ షిప్ ని మరింత బలోపేతం చేస్తామన్నారు. అదానీ గ్రూపులో ఏఎంఎన్ఎల్, దీనికి అనుబంధంగా ఉన్న ఏఈ ఎల్ మీడియా బిజినెస్ రంగంలో ఉన్నాయి. డిజిటల్, బ్రాడ్ కాస్ట్ సెగ్మెంట్లతో సరికొత్త మీడియా ప్లాట్ ఫామ్ ని ఏర్పాటు చేయడానికి ఇటీవలే ఓ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఈ ప్రకటన పేర్కొంది.