సుప్రీంకోర్టు దెబ్బకు మోడీ దిగొచ్చారా?
అదానీ గ్రూపు మీద మోడీ చర్చకు కాదు కదా కనీసం ఈగను కూడా వాలనివ్వడం లేదు. దాంతో విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ అనే లాయర్లు వేసిన కేసు కారణంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కేంద్రం అభ్యంతరం చెప్పినా సుప్రీంకోర్టు వినేట్లు లేదన్న ఉద్దేశంతోనే నిపుణుల కమిటీని కేంద్రం ఆమోదించింది.
వీడికి వాడే సరైన మొగుడు..దెబ్బకు దెయ్యం దిగొచ్చింది లాంటి ఉపమానాలను మనం తరచూ వింటునే ఉంటాం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సుప్రీంకోర్టు దెబ్బకు నరేంద్రమోడీ దిగొచ్చారు కాబట్టే. మోడీ వైఖరి చూస్తుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే మాత్రమే మాట వినేట్లుగా ఉన్నారు. కోర్టు తప్ప ఇంకెవరు ఎంత మొత్తుకున్నా చివరకు పార్లమెంటులో ప్రతిపక్షాలు ఎంత అరిచి గీపెట్టినా ఏమాత్రం లెక్కచేయటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూపులో జరుగుతున్న పరిణామాలపై నిపుణుల కమిటీ నియమించటానికి సుప్రీంకోర్టు నిర్ణయించింది.
వేరే దారిలేక నిపుణుల కమిటీ వేయటానికి ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. హిండెన్ బర్గ్ రిపోర్టు తర్వాత స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూపు బాగా దెబ్బతిన్నది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం మదుపరుల డబ్బు సుమారు రు.10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. అలాగే అదానీ గ్రూపుకు కూడా సుమారు రు.4.5 లక్షల కోట్ల నష్టమొచ్చింది. లక్షలాది మంది మదుపరులు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిన విషయమై చర్చించాలని ప్రతిపక్షాలు ఎంత గోల చేసినా మోడీ లెక్కే చేయలేదు.
అదాని గ్రూపు-హిండెన్ బర్గ్ నివేదిక మీద జాయింట్ పార్లమెంటు కమిటీ వేయాలన్న ప్రతిపక్షాల సూచనను పట్టించుకోలేదు. అదానీ గ్రూపు మీద మోడీ చర్చకు కాదు కదా కనీసం ఈగను కూడా వాలనివ్వడం లేదు. దాంతో విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ అనే లాయర్లు వేసిన కేసు కారణంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కేంద్రం అభ్యంతరం చెప్పినా సుప్రీంకోర్టు వినేట్లు లేదన్న ఉద్దేశంతోనే నిపుణుల కమిటీని కేంద్రం ఆమోదించింది.
ఆమధ్య మూడు వ్యవసాయ చట్టాల విషయంలో కూడా పార్లమెంటులో ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా లెక్కచేయలేదు. 8 మాసాల పాటు రైతు సంఘాలు ఉద్యమం చేసినా, సుమారు 200 మంది రైతులు మరణించినా కూడా మోడీ చలించలేదు. చివరకు సుప్రీంకోర్టు సూమోటోగా కేసు విచారణ మొదలుపెట్టగానే గత్యంతరం లేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు మోడీ ప్రకటించారు. అంతేకాకుండా దేశానికి క్షమాపణ కూడా చెప్పారు. తర్వాత పెగాసస్ స్పైవేర్ వాడకం విషయంలో కూడా ప్రతిపక్షాలను లెక్కచేయని మోడీ సుప్రీంకోర్టు విచారణతో దిగొచ్చారు. దీనిబట్టే మోడీ దిగిరావాలంటే సుప్రీంకోర్టు కొరడాను ఝుళిపించాల్సిందే అని అర్థమవుతోంది.