టెలికం సేవల్లోకి అదానీ.. కేంద్రం నుంచి మరో సంతర్పణ..
అదానీ గ్రూపు ఈ లైసెన్స్ తో తానే నేరుగా రంగంలోకి దిగుతుందా, లేక కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాని కొనుగోలు చేసి పోటీకి నిలబడుతుందా అనేది తేలాల్సి ఉంది.
టెలికం రంగంలో జియో ఎంతటి విప్లవాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ పోటీ తట్టుకోలేక వోడాఫోన్, ఐడియా కనుమరుగయ్యాయి. ఇప్పుడు కలసి ఉనికి కోసం పాట్లు పడుతున్నాయి. ఎయిర్ టెల్ తట్టుకున్నా కూడా లాభాల వాటా బాగా కరిగిపోయింది. ఇప్పుడు జియోని తలదన్నడానికి అదానీ రెడీ అవుతున్నారు. ఇతర రంగాల్లో అదానీకి కేంద్రం నుంచి సంతర్పణలు జరిగినట్టే.. ఈ రంగంలో కూడా ఫుల్ సపోర్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. తొలి అడుగుగా అదానీ గ్రూప్ స్ప్రెక్టమ్ కొనుగోలు చేసింది, ఇప్పుడు అదానీ అనుబంధ సంస్థ అయిన అదానీ డేటా నెట్ వర్క్ కు టెలికం సేవల లైసెన్స్ ని కేంద్రం మంజూరు చేసింది.
ఈ లైసెన్స్ తో అదానీ గ్రూప్ పూర్తిస్థాయిలో అన్ని రకాల టెలికం సేవలు అందించే వీలుంటుంది. ఇటీవల స్పెక్ట్రమ్ విషయంలో అదానీ డేటా నెట్ వర్క్స్ పేరుతో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత టెలికం సేవల విషయంలో ఎక్కడా ముందస్తు ప్రకటన లేదు. ఇప్పుడు సైలెంట్ గా అదానీ గ్రూప్ టెలికం లైసెన్స్ లు పొందడం విశేషం.
టెలికం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా చేతులెత్తేశాయి. ప్రైవేటు రంగంలో కూడా గుత్తాధిపత్యానికి ప్రభుత్వమే ఆజ్యం పోసింది. ఆరోగ్యకరమైన పోటీ లేకుండా ఆమధ్య జియో ఎంట్రీ ఇచ్చి ఉన్న వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఎడా పెడా రేట్లు పెంచేసి వినియోగదారుల్ని ముప్పతిప్పలు పెడుతున్నాయి కంపెనీలు. డేటా వినియోగానికి అలవాటు పడినవారంతా.. ప్యాకేజీల రేట్లు పెరిగినా రీచార్జ్ చేసుకోక తప్పనిపరిస్థితి. ఇక ఇప్పుడు అదానీ పేరుతో మరో డ్రామా మొదలు కాబోతోంది. జియో ఎలా విరుచుకుపడిందో, అదానీ కూడా అలాగే వినూత్న పథకాలతో ముందు వినియోగదారుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఎరకు అలవాటు చేసి ఆ తర్వాత ముక్కుపిండి వసూలు చేయడం మొదలు పెడుతుంది. అయితే అదానీ గ్రూపు ఈ లైసెన్స్ తో తానే నేరుగా రంగంలోకి దిగుతుందా, లేక కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాని కొనుగోలు చేసి పోటీకి నిలబడుతుందా అనేది తేలాల్సి ఉంది.