బీజేపీలో మహిళలకు ఎదురవుతున్న అవమానాలకు వ్యతిరేకంగా నటి పాదయాత్ర
బిజెపి ఓవర్సీస్, పొరుగు రాష్ట్రాల తమిళ అభివృద్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న గాయత్రిని పార్టీ పరువు తీసే కార్యకలాపాలు చేపట్టారని ఆరోపిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. అనంతరం ఆమె బీజేపీకి రాజీనామా చేశారు.
బీజేపీలో మహిళలకు ఎదురవుతున్న అవమానాలపై ప్రజలకు అవగాహన కల్గించేందుకు తమిళనాడుకు చెందిన ప్రముఖ నటి గాయత్రి రఘురామ్ పాద యాత్ర చేపట్టనున్నారు. చెన్నై నుంచి జనవరి 27న యాత్ర ప్రారంభించి కన్యాకుమారి వరకు వెళ్తానని ఆమె ప్రకటించారు.
బిజెపి ఓవర్సీస్, పొరుగు రాష్ట్రాల తమిళ అభివృద్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న గాయత్రిని పార్టీ పరువు తీసే కార్యకలాపాలు చేపట్టారని ఆరోపిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. అనంతరం ఆమె బీజేపీకి రాజీనామా చేశారు. దాంతో ప్రాథమిక సభ్యత్వం సహా పార్టీ బాధ్యతలన్నింటి నుంచి గాయత్రి రఘురామ్‌ను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు పార్టీ నాయకత్వం ప్రకటించింది.
ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ‘‘మహిళపై హీనంగా మాట్లాడే నాయకుడికి జెడ్ రక్షణ కల్పించారని మండిపడ్డారు.( బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి కేంద్ర ప్రభుత్వం జెడ్ రక్షణ కల్పించింది. )
''మీ గొప్ప మాటలకు కృతజ్ఞతలు తెలుపుతూ రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. మీ పార్టీలో మహిళల భద్రత సూపర్. నా కెరీర్‌ను నాశనం చేసినందుకు ధన్యవాదాలు, నా పేరును నాశనం చేసినందుకు ధన్యవాదాలు, నా స్త్రీత్వాన్ని అవమానించినందుకు ధన్యవాదాలు, నా 8 సంవత్సరాల సేవ, కృషి, డబ్బు తీసుకున్నందుకు ధన్యవాదాలు. నన్ను విసిరేసినందుకు పెద్ద ధన్యవాదాలు.'' అని గాయత్రి రఘురామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
''బిజెపి మహిళలను అవమానించినందుకు,పార్టీలో మహిళలకు రక్షణ కల్పించనందుకు నేను జనవరి 27 నుండి చెన్నై నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తాను. ఎవరైనా నాతో చేరవచ్చు లేదంటే ఒంటరిగానైనా చేస్తాను'' అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.