Telugu Global
National

కంగనా చెంప చెళ్లుమనిపించిన మహిళా కానిస్టేబుల్‌

బీజేపీ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో కంగనా రనౌత్‌ రైతులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.

కంగనా చెంప చెళ్లుమనిపించిన మహిళా కానిస్టేబుల్‌
X

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్‌ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ కంగనా చెంప చెళ్లుమనిపించారు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా కంగనా బిత్తరపోయారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరిన కంగన.. విమానం ఎక్కేందుకు చండీగఢ్‌ విమానాశ్రయంలో బోర్డింగ్‌ పాయింట్‌కు వెళ్తుండగా ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

రైతులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకే..

బీజేపీ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో కంగనా రనౌత్‌ రైతులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. తమ హక్కులను కాపాడుకునేందుకు రైతులు ఉద్యమం చేస్తుంటే.. రూ.100 కోసమే రైతులు ఉద్యమంలో కూర్చున్నారంటూ ఆమె కామెంట్‌ చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తాజాగా కంగనా రనౌత్‌ను చెంప దెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌.. ఆ కారణంతోనే ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ చర్యకు పాల్పడినట్టు చెప్పారు. రైతులపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కంగనా వెళ్లి అక్కడ కూర్చోగలరా అంటూ ఆమె ప్రశ్నించారు. కంగనా అలా మాట్లాడినప్పుడు తన తల్లి కూడా ఆ నిరసనల్లో కూర్చున్నారని ఆమె చెప్పారు.

తాను క్షేమంగానే ఉన్నానన్న కంగనా..

తనపై దాడి ఘటనపై కంగనా స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. సెక్యూరిటీ చెకింగ్‌ వద్ద ఈ ఘటన జరిగినట్టు తెలిపారు. సెక్యూరిటీ చెకింగ్‌ పూర్తయి పాస్‌ కోసం వేచి చూస్తుండగా.. సెక్యూరిటీ మహిళా ఆఫీసర్‌ తన వైపు వచ్చి కొట్టడంతో పాటు తనను దూషించారన్నారు. ఎందుకిలా చేశావని అడిగితే.. తాను రైతు నిరసనలకు మద్దతుదారునని ఆమె చెప్పినట్లు కంగనా తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని.. కాకపోతే పంజాబ్‌లో ఉగ్రవాదం, హింసను ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే ఆందోళనగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

కుల్విందర్‌ సస్పెన్షన్‌...

కంగనాను చెంపదెబ్బ కొట్టిన మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ ఘటన అనంతరం ఢిల్లీ చేరుకున్న కంగనా..∙సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్, ఇతర సీనియర్‌ అధికారులను కలిసి ఈ ఘటన గురించి వివరించారు. దీంతో దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు.. కుల్విందర్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రశ్నించేందుకు సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ కార్యాలయానికి తరలించారు.

First Published:  7 Jun 2024 2:12 AM GMT
Next Story