మథుర ఓటర్లకు హీరోయిన్లే కావాలా..? హేమా మాలిని సెటైర్లు..
మథుర ప్రజలు సినిమా నటుల్నే కోరుకుంటే.. రేపు తన ప్లేస్ లో కంగనా రనౌత్ రావొచ్చు, లేదా ఆమె స్థానంలో రాఖీ సావంత్ కూడా రావొచ్చంటూ వెటకారం చేశారు హేమా మాలిని.
ఉత్తర ప్రదేశ్ లోని మథుర లోక్ సభ స్థానానికి ప్రస్తుతం హేమా మాలిని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ స్థానం నుంచి ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ పోటీ చేస్తుందనే ప్రచారం ఉంది. కంగనా పోటీ చేస్తే మరి హేమా మాలిని సంగతేంటనేది తేలాల్సి ఉంది. ఇటీవల మథురలో పర్యటించిన హేమా మాలినికి స్థానిక మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురైంది. మథురలో వచ్చేసారి కంగనాకు బీజేపీ నుంచి అవకాశం ఇస్తారట కదా.. అని విలేకరులు ప్రశ్నించడంతో హేమా మాలిని షాకైంది. మథుర వాసులకు హీరోయిన్లే కావాలా అంటూ సెటైర్లు వేసింది.
హేమా మాలిని రిటైర్డ్ హీరోయిన్. కానీ ఆమె ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. ఇప్పటికీ స్టేజ్ షో లు ఇస్తూ యువతరంతో పోటీ పడుతుంటారు. అయితే ఇప్పుడు కొత్తగా బీజేపీలో కంగనా రనౌత్ పేరు మారుమోగిపోతోంది. బీజేపీకి సపోర్ట్ గా మాట్లాడుతూ ఆమె నిత్యం వార్తల్లో ఉంటోంది. ఒకరకంగా బీజేపీలో ఉన్న సినీ నటులకు ఆమె పోటీగా మారుతోందనేమాట వాస్తవం. హేమా మాలినికి మథురకు స్థానికురాలు కాదు, రేపు కంగనా రనౌత్ వచ్చినా ఆమె కూడా స్థానికురాలు కాదు. మథుర ప్రజలు స్థానికేతరుల్నే కోరుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు హేమా మాలిని.
హేమ, కంగన, రాఖీ సావంత్..
మథుర ఎంపీ టికెట్ పై వచ్చిన ప్రశ్నలకు హేమా మాలిని వెటకారంగా సమాధానమిస్తున్నారు. మథుర ప్రజలు స్థానికేతరుల్ని, సినిమా నటుల్నే కోరుకుంటే.. రేపు హేమా మాలిని ప్లేస్ లో కంగనా రనౌత్ రావొచ్చు, లేదా ఆమె స్థానంలో రాఖీ సావంత్ కూడా రావొచ్చంటూ వెటకారం చేశారు. కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారనే వార్తలతో హర్ట్ అయిన హేమా మాలిని ఇలా రాఖీ సావంత్ తో ఆమెను పోల్చి సెటైర్లు వేశారని తెలుస్తోంది.