Telugu Global
National

జయప్రదకు జైలుశిక్ష

దీంతో కార్మికులందరూ కార్మిక బీమా కార్పొరేషన్‌ను ఆశ్రయించారు. ఆ బీమా సంస్థ చెన్నైలోని ఎగ్మోర్‌ కోర్టులో థియేటర్‌ యాజమాన్యానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది.

జయప్రదకు జైలుశిక్ష
X

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదకు బిగ్‌షాక్‌ తగిలింది. ఆమెకు చెన్నైలోని ఎగ్మోర్‌ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా కూడా విధించింది.

చెన్నైకి చెందిన రామ్‌కుమార్‌,రాజబాబుతో కలిసి అన్నా రోడ్డులో జయప్రద ఓ థియేటర్‌ను నడిపించారు. మొదట్లో లాభాలు వచ్చినప్పటికీ తర్వాత క్రమంగా నష్టాలు రావడంతో ఆ థియేటర్‌ను మూసివేశారు. థియేటర్‌ నడిచే టైంలో.. కార్మికుల నుంచి ESI రూపంలో యాజమాన్యం కొంత డబ్బు వసూలు చేసింది. అయితే థియేటర్ మూసివేసినప్పటికీ.. తిరిగి కార్మికులకు ఆ డబ్బులు చెల్లించలేదు. దీంతో కార్మికులందరూ కార్మిక బీమా కార్పొరేషన్‌ను ఆశ్రయించారు. ఆ బీమా సంస్థ చెన్నైలోని ఎగ్మోర్‌ కోర్టులో థియేటర్‌ యాజమాన్యానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది.

కార్మికుల నుంచి వసూలు చేసిన ESI డబ్బులను థియేటర్ యాజమాన్యం తిరిగి చెల్లించలేదని కోర్టుకు చెప్పింది. అయితే కార్మిక బీమా సంస్థ పిటిషన్‌ను సవాల్ చేస్తూ థియేటర్ యాజమాన్యం దాఖలు చేసిన మూడు పిటిషన్లను ఎగ్మోర్‌ కోర్టు కొట్టివేసింది. ESI డబ్బులు తిరిగి కార్మికులకు అందజేస్తామని చెప్పినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. ఇరుపక్షాల వాదనలు విన్న ఎగ్మోర్ న్యాయస్థానం జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలుశిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

తెలుగునాట ఎన్నో సినిమాల్లో నటించిన జయప్రద.. 1994లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరిన ఆమె.. 2004లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. 2009లోనూ తిరిగి అదే స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు.

First Published:  11 Aug 2023 10:09 AM GMT
Next Story