Telugu Global
National

కెప్టెన్‌ విజయ్‌కాంత్ కన్నుమూత

1979లో 27 ఏళ్ల వయసులో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్‌కాంత్‌ ఆ ఏడాది విడుదలైన `ఇనిక్కుం ఇలమై` సినిమాలో విలన్‌ రోల్‌ పోషించారు.

కెప్టెన్‌ విజయ్‌కాంత్ కన్నుమూత
X

తమిళ నటుడు, DMDK వ్యవస్థాపకుడు కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ కన్నుమూశారు. 71 ఏళ్ల విజయకాంత్‌ కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. కెప్టెన్ మృతితో తమిళనాడు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

1979లో 27 ఏళ్ల వయసులో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్‌కాంత్‌ ఆ ఏడాది విడుదలైన `ఇనిక్కుం ఇలమై` సినిమాలో విలన్‌ రోల్‌ పోషించారు. ఇక 1980లో వచ్చిన `దూరతు ఇది ముజక్కమ్` అనే సినిమా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. తమిళ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన అతికొద్ది మంది నటుల్లో విజయ్‌కాంత్ ఒకరు. ఆయన సినిమాలు ఎక్కువగా తెలుగు, హిందీ భాషల్లోకి డబ్ అయ్యాయి. దేశభక్తి, అవినీతికి వ్యతిరేకంగా తీసిన సినిమాల్లో విజయకాంత్ ఎక్కువగా నటించారు. పోలీస్ ఆఫీసర్‌గా దాదాపు 20కి పైగా సినిమాల్లో నటించారు విజయ్‌కాంత్. తమిళ సినిమా ఇండస్ట్రీ విజయకాంత్‌ను `పురుట్చి` కలైంగర్` - విప్లవ కళాకారుడుగా బిరుదు ఇచ్చింది. దాదాపు 154కి పైగా చిత్రాల్లో విజయ్‌కాంత్ నటించారు. విజయకాంత్‌ ప్రతిభకు మెచ్చి అనేక అవార్డులు ఆయనను వరించాయి. నిర్మాతగా, దర్శకుడిగానూ రాణించారు.


2005లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్‌కాంత్‌.. దేశీయ మొర్పొక్కు ద్రవిడ కజగం -DMDK పేరుతో పార్టీ స్థాపించారు. 2006లో తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీ చేసిన DMDK.. కేవలం విజయకాంత్ పోటీ చేసిన వృద్ధాచలం అసెంబ్లీ స్థానం మాత్రమే గెలిచింది. ఆ ఎన్నికల్లో మంచి ఓట్ షేర్ సాధించింది. 2011లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసిన డీఎండీకే 41 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో డీఎంకే కంటే ఎక్కువ సీట్లు సాధించింది DMDK. రిషివిదియం స్థానం నుంచి విజయ్‌కాంత్ రెండో సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో ఉలుందూర్‌పేట నుంచి పోటీ చేసిన విజయ్‌కాంత్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. తర్వాత క్రమంగా రాజకీయాల్లో ఆయన ప్రభ తగ్గుతూ వచ్చింది.

First Published:  28 Dec 2023 5:13 AM GMT
Next Story