భార్య, మేనల్లుడిపై పోలీస్ అధికారి కాల్పులు.. ఆపై ఆత్మహత్య
తుపాకీ శబ్దం వినిపించడంతో పక్క గదిలో ఉన్న కుమారుడు, మేనల్లుడు పరుగున అక్కడికి చేరుకున్నారు. తలుపు తెరిచిన మేనల్లుడు దీపక్ (35)పై కూడా భరత్ కాల్పులు జరిపాడు.

ఓ పోలీసు అధికారి తన భార్యను, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపి.. తానూ ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన ఘటన సంచలనం కలిగించింది. ఈ దారుణ ఘటనకు పాల్పడిన పోలీస్ అధికారి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అమరావతి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ భరత్ గైక్వాడ్ (57) బానర్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో భరత్ గైక్వాడ్ తన తుపాకీతో మొదట తన భార్య మోని గైక్వాడ్ (44) తలపై కాల్చి హతమార్చాడు.
తుపాకీ శబ్దం వినిపించడంతో పక్క గదిలో ఉన్న కుమారుడు, మేనల్లుడు పరుగున అక్కడికి చేరుకున్నారు. తలుపు తెరిచిన మేనల్లుడు దీపక్ (35)పై కూడా భరత్ కాల్పులు జరిపాడు. ఛాతీపై బుల్లెట్ తగలడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని భరత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.