Telugu Global
National

మృత్యు ఘంటికలు.. ఆ 3 గంటలు..

సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య జరిగిన ప్రమాదాల్లో 81,410 మంది మృత్యువాతపడ్డారు. సాయంత్రం 6 గంటల నుంచి వాతావరణంలో మార్పు రావడం, వెలుతురు క్రమంగా తగ్గడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

మృత్యు ఘంటికలు.. ఆ 3 గంటలు..
X

రోడ్డు ప్రమాదాలు ఏ రాష్ట్రంలో ఎక్కువ జరుగుతున్నాయి, ఏ రోడ్లపై ఎక్కువ జరుగుతున్నాయనే విషయాలతోపాటు.. ఏ సమయాల్లో ఎక్కువ జరుగుతున్నాయనే లెక్క కూడా తేలిపోయింది. ఆ మూడు గంటల్లో రోడ్డెక్కితే మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. అవును సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య ప్రయాణాలు అత్యంత ప్రమాదకరం అని తేలింది.

ఇవీ లెక్కలు..

గతేడాది మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో 4 లక్షలమందికి పైగా మరణించారు. అంటే ప్రతి గంటకు సగటున 50 మంది మృత్యువాత పడుతున్నారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య జరిగిన ప్రమాదాల్లో మరణాల శాతం ఎక్కువగా ఉంది. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (NCRB)-2021 నివేదిక ప్రకారం ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రతి రోజు 24 గంటల వ్యవధిలో జరిగే రోడ్డు ప్రమాదాలను ఈ నివేదిక విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య జరిగిన ప్రమాదాల్లో 81,410 మంది మృత్యువాతపడ్డారు. సాయంత్రం 6 గంటల నుంచి వాతావరణంలో మార్పు రావడం, వెలుతురు క్రమంగా తగ్గడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది. పగలు స్పష్టంగా వెలుతురు ఉన్న పరిస్థితి నుంచి సాయంత్రానికి క్రమంగా చీకటి పడటం, ఈ క్రమంలో లైట్లు వేసుకోవడంలో అలసత్వం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్తగా అమ్మే వాహనాలకు 24గంటలు లైట్లు వెలిగే సిస్టమ్ అందుబాటులోకి తెచ్చినా కూడా కొంతమంది దాన్ని తీసేస్తున్నారు. దీంతో సాయంత్రం లైట్లు వేసే విషయంలో బద్దకిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తేలింది.

మధ్యాహ్నం కూడా డేంజరే..

సాయంత్రంతో పాటు.. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు జరిగే ప్రమాదాల్లో కూడా మరణాల సంఖ్య ఎక్కువని తేలింది. సాయంత్రం ప్రమాదాల్లో గతేడాది 71,711 మంది మృతిచెందినట్టు NCRB నివేదిక తెలిపింది. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య ట్రాఫిక్‌ తక్కువగా ఉండటంతో వాహనదారులు వేగం పెంచుతున్నారని, ఈ అతివేగమే ప్రమాదాలకు కారణం అవుతుందని తెలుస్తోంది. అతివేగం, అజాగ్రత్త వల్ల ప్రమాదాలు, మృతుల సంఖ్య పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

First Published:  12 Sept 2022 6:12 AM GMT
Next Story