ఢిల్లీలో నివసించాలనుకుంటే.. 11.9 ఏళ్ల ఆయుష్షు వదులుకోవాల్సిందే..!
ప్రస్తుత కాలుష్య స్థాయి ఇదే రీతిలో కొనసాగితే ఇక్కడి ప్రజలు 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆ అధ్యయనం తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా అది నేటికీ కొనసాగుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ ఈ వివరాలు వెల్లడించింది. ప్రస్తుత కాలుష్య స్థాయి ఇదే రీతిలో కొనసాగితే ఇక్కడి ప్రజలు 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆ అధ్యయనం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన స్థాయిల కంటే ఇక్కడ కాలుష్యం చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది.
అంతేకాదు.. మన దేశంలో 67.4 శాతం మంది కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా పీఎం 2.5 (అతిసూక్ష్మ ధూళి కణాల కాలుష్యం) కారణంగా దేశ ప్రజల సరాసరి ఆయుర్దాయం 5.3 ఏళ్లు తగ్గిపోతోందని తెలిపింది.
అత్యంత తక్కువ కాలుష్యమున్న పంజాబ్ లోని పఠాన్ కోట్ జిల్లాలోనూ ప్రమాదకర కాలుష్య స్థాయిలు (పీఎం 2.5) డబ్ల్యూహెచో ప్రమాణాల కంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కడి ప్రజల జీవితం కూడా 3.1 ఏళ్లు తగ్గిపోతుందని అంచనా వేసింది. కాలుష్యం కారణంగా బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, చైనా, నైజీరియా, ఇండోనేషియా దేశాల్లోని ప్రజలు ఒకటి నుంచి ఆరు సంవత్సరాలకు పైగా తమ జీవితకాలాన్ని కోల్పోతున్నారని తాజా నివేదిక వివరించింది.
*