Telugu Global
National

ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ విశ్వాస తీర్మానం..లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్ ను తొల‌గించాల‌ని డిమాండ్‌

ఢిల్లీ అసెంబ్లీలో ఈ రోజు ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ తన ప్ర‌భుత్వంపై విశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా సభ్యులు ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్ వినయ్ కుమార్ సక్సేనాను తొలగించాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ విశ్వాస తీర్మానం..లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్ ను తొల‌గించాల‌ని డిమాండ్‌
X

ఇటీవ‌ల ఆప్, బిజెపి మ‌ధ్య‌ నెల‌కొన్న ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల నేప‌ధ్యంలో ఢిల్లీ అసెంబ్లీ సోమ‌వారంనాడు ప్ర‌త్యేకంగా స‌మావేశం అయింది. ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ స్పీక‌ర్ అనుమ‌తితో త‌మ ప్ర‌భుత్వంపై విశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. అంత‌కు ముందు స‌భ‌లో బిజెపి స‌భ్యులు ఢిల్లీ ముఖ్యమంత్రి దొంగ‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ‌ల‌భా సృష్టించారు. వారిని బ‌ల‌వంతంగా మార్ష‌ల్స్ స‌భ‌నుంచి పంపేశారు. బిజెపి త‌మ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలంతా త‌మ‌తోనే ఐక్యంగా ఉన్నార‌ని చెప్పేందుకే ఈ విశ్వాస ఓటును ఎదుర్కొంటున్నాన‌ని చెప్పారు. బిజెపి చేస్తున్న కుట్ర‌లు, ఢిల్లీలో ఆప‌రేష‌న్ లోట‌స్ విప‌ల‌మైంద‌ని నిరూపించ‌డానికే ఈ విశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టామ‌ని అన్నారు. ఆప్‌లోని ప్రతి ఎమ్మెల్యే, కార్యకర్త, మంత్రి నిజాయితీపరులని చూపించడానికి విశ్వాస ఓటు అవసరం. మా ఎమ్మెల్యేలను రూ.20 కోట్లకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడుపోలేదని ఢిల్లీ ప్రజలకు ఈరోజు నిరూపిస్తామ‌ని కేజ్రీవాల్ అన్నారు. మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర , అస్సాంతో సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడానికి బిజెపి ఇప్పటివరకు 277 మంది ఎమ్మెల్యేలను "కొనుగోలు" చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. రాబోయే 15 రోజుల్లో జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. " మా ఎమ్మెల్యేల‌ను కూడా కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఈ విశ్వాస తీర్మానం ద్వారా, ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేర ని ఢిల్లీ వాసులకు చూపించాలనుకున్నాం. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి చేపట్టిన 'ఆపరేషన్ కమలం' విఫలమైంది."అని ముఖ్య‌మంత్రి అన్నారు.

ఈ యేడాది ప్రారంభంలో ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన నూత‌న‌ లిక్క‌ర్ విధానంలో ముడుపులు అందాయ‌ని ఆరోపిస్తూ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా ఇంటిపైసిబిఐ దాడులు చేసింది. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రిపై కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌ద్యంలో త‌మ ఎమ్మెల్యేల‌ను పార్టీ మార్చేందుకు కోట్లాది రూపాయ‌లు ఎర చూపార‌ని ఆరోపించారు.

లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్ ను తొల‌గించాలి..

సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ సంద‌ర్భంగా ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ మాట్లాడుతూ. ఢిల్లీ ఎల్-జి వినయ్ కుమార్ సక్సేనా 1,400 కోట్ల రూపాయల ఖాదీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు.

ఎల్-జీ వినయ్ కుమార్ సక్సేనాపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో, ఆప్ ఎమ్మెల్యేలు ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు చేతుల్లో బ్యానర్లు, ప్లకార్డులతో త‌మ స్థానాల్లో లేచి నిలబడి నినాదాలు చేశారు. క‌డ‌ప‌టి వార్త‌లు అందేస‌రికి స‌భ‌లో ఇంకా చ‌ర్చ కొన‌సాగుతోంది.

First Published:  29 Aug 2022 9:10 AM GMT
Next Story