Telugu Global
National

సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లను కూడా అరెస్ట్ చేసి వారిని రాజీనామా చేయాలని బీజేపీ ఒత్తిడి తెస్తుందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారు
X

లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేశారని బీజేపీపై మండిపడ్డారు. తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లను కూడా అరెస్ట్ చేసి వారిని రాజీనామా చేయాలని బీజేపీ ఒత్తిడి తెస్తుందన్నారు. దేశంలో బీజేపీ మాత్రమే ఉండాలి. ఇతర పార్టీలు ఉండకూడదనేదే ప్రధాని మోడీ టార్గెట్ అన్నారు సంజయ్ సింగ్.

"ఓ రెండు తప్పుడు కేసులు పెట్టాలి. అరెస్ట్ చేసి రాజీనామా చేయాలని ఒత్తిడి తేవాలి. బీజేపీకి, ఈడీకి ఇది చాలా తేలికైన పని. సీఎం కేజ్రీవాల్‌పై రెండు తప్పుడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. రేపు, భగవంత్ మాన్‌పై రెండు తప్పుడు కేసులు నమోదు చేయండి. ఆపై ఆయన్ని కూడా ఎత్తుకుని, జైలులో పడేసి, రాజీనామా చేయాలని డిమాండ్ చేయండి. మమతా బెనర్జీతో కూడా అదే చేయండి. మీరు ఇప్పటికే రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, విజయన్, స్టాలిన్, చంపై సోరెన్, హేమంత్ సోరెన్‌లపై కేసులు పెట్టారు. కేవలం రెండు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రతిపక్షాన్ని అంతం చేయడమే మీ ఉద్దేశం" .

"బీజేపీ అనుసరిస్తున్న పద్ధతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. త్వరలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ విడుదల అవుతారు. ప్రజల కోసం పనిచేసే కేజ్రీవాల్‌ను బీజేపీ ఆపలేదు. ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న నియంతృత్వ ప్రభుత్వం.. ప్రజా ఉద్యమం నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ధరల పెరుగుదల, రైతుల అంశాలు, మణిపూర్ హింస వంటి వాటికి వ్యతిరేకంగా తాము గొంతు విప్పుతూనే ఉన్నాం, ఉంటాం" అంటూ బీజేపీపై మండిపడ్డారు ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్.

First Published:  5 April 2024 11:45 AM IST
Next Story