Telugu Global
National

పాలు వర్సెస్ పెట్రోలు.. మోదీ హయాంలో విజేత ఎవరంటే.. ?

మోదీ హయాంలో పాలు, పెట్రోల్ పోటీ పెట్టుకుని మరీ పెరుగుతున్నాయని విమర్శిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. తాజాగా అమూల్ పాల ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై వారు ఘాటుగా స్పందించారు.

పాలు వర్సెస్ పెట్రోలు.. మోదీ హయాంలో విజేత ఎవరంటే.. ?
X

మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయనేది వాస్తవం. ఉప్పు, పప్పు, నూనె.. ఏ వస్తువు తీసుకున్నా దాని జీవిత కాల గరిష్టాలను మోదీ హయాంలోనే నమోదు చేసుకుంది. భవిష్యత్తులో ఇవి తగ్గుతాయనే ఆశ ఎవరికీ లేదు, మోదీ ఉండగా అది సాధ్యం కాదని అంటున్నాయి ప్రతిపక్షాలు. తాజాగా పాలు, పెట్రోల్ మధ్య ఓ పోలిక వచ్చింది. మోదీ హయాంలో పాలు, పెట్రోల్ పోటీ పెట్టుకుని మరీ పెరుగుతున్నాయని విమర్శిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. తాజాగా అమూల్ పాల ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై వారు ఘాటుగా స్పందించారు.

గుజరాత్ లో రేటు పెరగదు..

విచిత్రం ఏంటంటే.. దేశవ్యాప్తంగా పాల ధరను లీటర్ కి 2రూపాయలు పెంచిన అమూల్ సంస్థ.. గుజరాత్ లో మాత్రం ధరను పెంచలేదు. గుజరాత్ లో ఎన్నికలకు టైమ్ దగ్గరపడటంతో ఇక్కడ ధరను వ్యూహాత్మకంగా పెంచలేదని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ పాల ధర పెంపుపై తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. గుజరాత్ కి ఎందుకు మినహాయింపు ఇచ్చారని, ఇదెక్కడి రాజకీయం అని నిలదీస్తున్నారు విపక్షాల నేతలు.

అమూల్‌ పాల ధరలు పెంచడం ఈ ఏడాది వరుసగా ఇది మూడోసారి. గతంలో ఈ పెరుగుదలకు పాల ప్యాకేజీ, రవాణా, పశుగ్రాసం రేట్లు పెరగడం వంటి కారణాలు చూపించారు. కానీ ఇప్పుడు ఎలాంటి కారణం లేకుండానే లీటరుకి 2రూపాయలు పెంచారు. మొన్నటి వరకూ పెట్రోల్ ధరలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టిన కేంద్రం, ఇప్పుడు పాల ధరతో ప్రతాపం చూపిస్తోందని మండిపడ్డారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా. పాలు, పెట్రోల్ ధరల విషయంలో పోటీ పడుతున్నాయని. ఆ రెండిటికీ కళ్లెం వదిలేసిన కేంద్రం తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  15 Oct 2022 7:36 PM IST
Next Story