Telugu Global
National

కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బేసిన ఆప్.. బీజేపీ విజయానికి ఆ పార్టీనే కారణం!

ఫలితాల సరళిని గమనిస్తే ఆప్ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యింది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆప్ భారీగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చింది.

కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బేసిన ఆప్.. బీజేపీ విజయానికి ఆ పార్టీనే కారణం!
X

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ దూసుకొని పోతోంది. 2017 ఎన్నికల కంటే 50కి పైగా సీట్లు అధికంగా గెలుచుకొని బంపర్ విక్టరీని సాధించబోతోంది. ఈ సారి గుజరాత్‌లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని విశ్లేషకులు భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ పాతిక లోపు సీట్లకే పరిమితం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు కొన్నైతే.. ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో మరింత నష్టం చేకూరింది.

ఢిల్లీ నుంచి ప్రస్థానం మొదలు పెట్టిన ఆప్.. పంజాబ్ రాష్ట్రాన్ని కూడా తమ ఖాతాలో వేసుకున్నది. గోవాలో చెప్పుకోదగిన ఓట్లను ఆప్ సాధించింది. అదే ఊపులో గుజరాత్‌లో కూడా కింగ్ మేకర్‌గా మారతామని, కలిసొస్తే అధికారం కూడా చేపడతామని పార్టీ చీఫ్ కేజ్రివాల్ ప్రకటించారు. ఎన్నడూ లేని విధంగా ఆప్ కూడా హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి పలు హామీలు గుప్పించింది. చివరకు ఇవ్వాళ వెలువడుతున్న ఫలితాల సరళిని గమనిస్తే ఆప్ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యింది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆప్ భారీగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చింది.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలిపి 24 వేల పైచిలుకు (0.1 శాతం) ఓట్లు సాధించిన ఆప్.. ఈ సారి దాదాపు 9 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. మిగిలిన చోట్ల భారీగా ఓట్లను చీల్చడంతో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన చోట కూడా బీజేపీ అభ్యర్థులు ముందంజలోకి వెళ్లారు. ఆప్‌తో పాటు ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలకు గండి కొట్టారు. గుజరాత్‌లో ప్రభుత్వ వ్యతిరేకత గెలిపిస్తుందని నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్‌కు ఆప్ భారీగా దెబ్బతీయడం అధిష్టానాన్ని ఆలోచింప చేస్తోంది.

ఒక వైపు బీజేపీని కలిసి కట్టుగా ఎదుర్కోవడంతో విపక్షాలు ఏకమవ్వాలనే ఆలోచన చేస్తుంటే.. ఆప్ లాంటి పార్టీలు ఇలా ఓట్లను చీల్చి తిరిగి బీజేపీకే అధికారం దక్కేలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆప్ అగ్రనాయకులు కావాలనే ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎలాంటి క్యాడర్, ఓటు బ్యాంకు లేకపోయినా.. గుజరాత్‌లో ఆప్ చేసిన హడావిడి కారణంగా కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక రకంగా ఆప్.. బీజేపీకి బీ టీమ్‌లాగ వ్యవహరించిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

గెలుస్తామనే నమ్మకం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేకపోయినా.. బీజేపీతో సమాన స్థానాల్లో ఆప్ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని అంచనాలు వేసుకున్న సెగ్మెంట్లలో ఆప్ అభ్యర్థులు భారీగానే ఓట్లను సాధించారు. ఒకవేళ ఆప్ లేకుంటే.. ఆ ఓట్లు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే పడేవి. బీజేపీ ముందు నుంచి అంచనా వేసినట్లు.. విపక్షాలన్నీ విడివిడిగా పోటీ చేయడం ఆ పార్టీకి కలిసి వచ్చింది. గుజరాత్ ఫలితాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు ఒక పాఠమే అని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 2017లో 77 సీట్లు గెలవగా.. ఇప్పుడు 50కి పైగా సీట్లు కోల్పోతున్నది. గతంలో 0.1 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆప్.. ఈ సారి తమ ఓటు బ్యాంకును పెంచుకున్నది.

First Published:  8 Dec 2022 12:31 PM IST
Next Story