Telugu Global
National

మీ సీఎంను మీరే ఎంపిక చేసుకోండి.. గుజరాత్ లో ఆప్ పోల్..

పంజాబ్ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో కూడా అదే పద్ధతి ఫాలో అవుతోంది ఆప్. ఇక్కడ కూడా మీ సీఎం ఎవరో మీరే నిర్ణయించుకోండి అంటూ ప్రజలనుంచి క్రౌడ్ సోర్సింగ్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నారు కేజ్రీవాల్.

మీ సీఎంను మీరే ఎంపిక చేసుకోండి.. గుజరాత్ లో ఆప్ పోల్..
X

రాష్ట్రంలోని ఓటర్లు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, ఆ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారు. సహజంగా అన్ని రాష్ట్రాల్లో జరిగేది ఇదే. అయితే ఎమ్మెల్యేలు ఎంపిక చేసే ముందే ఆ అభ్యర్థి ఎవరనేది తెలిసిపోతుంది. జాతీయ పార్టీల్లో సస్పెన్స్ ఉంటుందేమో కానీ, ప్రాంతీయ‌ పార్టీల్లో అలాంటి అవకాశం కూడా ఉండదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆమధ్య పంజాబ్ ఎన్నికల సందర్భంగా కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ప్రజలే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునేలా ఒపీనియన్ పోల్ పెట్టింది. అది సక్సెస్ కావడంతో ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో కూడా అదే పద్ధతి ఫాలో అవుతోంది. ఇక్కడ కూడా మీ సీఎం ఎవరో మీరే నిర్ణయించుకోండి అంటూ ప్రజలనుంచి క్రౌడ్ సోర్సింగ్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నారు కేజ్రీవాల్.

ఎలా ఎన్నుకోవాలి..?

6357000360 నెంబర్ కు వాయిస్ మెసేజ్ లేదా అదే నెంబర్ కు వాట్సప్ మెసేజ్, లేదా టెక్స్ట్ మెసేజ్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ -3లోపు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సీఎంగా ఎవరు ఉండాలో నిర్ణయించండి అంటూ కేజ్రీవాల్ ఫోన్‌ నెంబర్ ప్రకటించారు. వాటి ఫలితాలను నవంబర్-4న వెల్లడిస్తామని చెప్పారు. ప్రజలు ఎంపిక చేసిన అభ్యర్థినే సీఎంగా ప్రకటిస్తామని, అందులో అనుమానం లేదని చెప్పారు. పంజాబ్ లో కూడా ప్రజల కోరిక మేరకే సీఎం భగవంత్ మన్ ని ఎంపిక చేశామని, ఇక్కడ కూడా అదే పద్ధతి అవలంబిస్తామన్నారు. ఇటీవల బీజేపీ ప్రభుత్వం సీఎం లను మార్చడంపై కూడా కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. ప్రజామోదం లేకుండా అలా ముఖ్యమంత్రులను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపిక చేయబోదని చెప్పారు కేజ్రీవాల్.

27ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం..

గుజరాత్ లో 27ఏళ్లుగా బీజేపీ పాలన కొనసాగుతోంది. దీనికి చరమగీతం పాడేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలో, పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్నా కూడా కేజ్రీవాల్ వెనక్కి తగ్గడంలేదు గుజరాత్ లో దూకుడుగా ప్రచారం చేస్తూ, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఉచిత విద్యుత్, మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు వంటి హామీలతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకోండి అంటూ గుజరాత్ ఓటర్లకు పిలుపునిచ్చారు కేజ్రీవాల్.

First Published:  29 Oct 2022 2:51 PM IST
Next Story